Share News

నిధులకు ఎదురు చూపులు

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:57 AM

బకాయిల భారం బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లను కుంగదీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన రెండేళ్ల బకాయిలను విడుదల చేయకపోవడంతో స్కూల్‌ యాజమాన్యాలు ఇక పాఠశాలలను నడుపలేమంటూ చేతులెత్తేశాయి.

నిధులకు ఎదురు చూపులు

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): బకాయిల భారం బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లను కుంగదీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన రెండేళ్ల బకాయిలను విడుదల చేయకపోవడంతో స్కూల్‌ యాజమాన్యాలు ఇక పాఠశాలలను నడుపలేమంటూ చేతులెత్తేశాయి. రాష్ట్రంలోని బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లోని విద్యార్థులను సోమవారం దసరా సెలవుల అనంతరం అనుతించలేదు. ప్రభుత్వం సెలవుల్లోగా బకాయిలు ఇవ్వకుంటే స్కూళ్లను నిర్వహించలేమని, విద్యార్థులు పాఠశాలకు రావద్దంటూ స్కూల్‌ యాజమాన్యాలు ముందే ప్రకటించాయి. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను యథావిధిగా నడిపించాలని, ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే బిల్లులు ఇప్పిస్తామని స్కూల్‌ యాజమాన్యాలకు హామీ ఇచ్చారు. నిధులు రాకపోవడంతో బిల్లుల భారం మోయలేమంటూ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ యాజమాన్యాలు సోమవారం పాఠశాలలకు విద్యార్థులను లోనికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొన్ని చోట్ల ఆందోళనకు దిగగా, కరీంనగర్‌ కలెక్టర్‌ను కలిసేందుకు కొంత మంది విద్యార్థులు ప్రయత్నించారు. కలెక్టర్‌ కార్యాలయంలో లేక పోవడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సంఘం మంగళవారం కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ధర్నాచేద్దామని తెలపడంతో వెనుదిరిగి వెళ్లారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ పమేలా సత్పతి బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావుతో పాఠశాలలు నడిపించాలని ఫోన్‌లో కోరినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్‌ యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలోని 15 స్కూళ్లను మూసివేశారు.

ఫ జిల్లాలో రూ. 7.5 కోట్ల బకాయిలు

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల (బీఏఎస్‌)బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని 15 బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌కు దాదాపు 7.50 కోట్ల బకాయిలు ఉన్నాయి. దీంతో పాఠశాలల యాజామన్యాలు ఇబ్బందిబడుతున్నాయి. గత ఏడాది వరకు జిల్లాలో 11 బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ ఉండగా ఒక్కో స్కూల్‌లో 173 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా మరో నాలుగు స్కూళ్లను ఎంపిక చేయడంతోపాటు ఒక్కో స్కూల్‌కి 10 మంది ఎస్టీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో పాఠశాలలకు నిధులను పెంచుతూ వచ్చారు. 2020 విద్యా సంవత్సరం వరకు స్కూల్స్‌ యాజమాన్యాలకు నిధులు సక్రమంగా విడుదల చేశారు. తరువాత నిధులు సక్రమంగా విడుదల చేయక పోవడంతో పాఠశాలల నిర్వహకులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఫ అప్పులు చేస్తూ..నడపటం మా వల్లకాదు

- యాదగిరి శేఖర్‌రావు, బీఏఎస్‌ పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి

ప్రభుత్వం ఇచ్చే స్కూల్‌ రికగ్నైజేషన్‌ పత్రాలను, ఇతర డాక్యుమెంట్లను తాకట్టు పెట్టి పాఠశాలలను నడిపిస్తున్నాము. ఇప్పటి వరకు ఒక్కో స్కూల్‌కు రెండు కోట్ల మేరకు అప్పు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలి. లేకపోతే ఇలాగే అప్పులు చేస్తూ స్కూల్స్‌, హాస్టల్‌ నడపడం మా వల్ల కాదు. స్కూళ్లకు తాళాలు వేసి ప్రభుత్వానికే అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు రావలసిన బకాయిలను మాత్రమే విడుదల చేయాలని కోరుతున్నామే తప్ప అదనంగా ఏమి కోరడం లేదు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతూ ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా మాకు న్యాయం జరుగడం లేదు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌పై ఆలోచన చేసి వెంటనే పెండింగ్‌ నిధులను విడుదల చేయాలి.

ఫ ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు

- విద్యార్థి సంఘాల నాయకులు

ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు సంబంధించిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌కు చెల్లించాల్సిన పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలి. స్కూల్స్‌ నిర్వహకులకు బిల్లులను ఇవ్వక పోవడంతో ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిధలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులను పాఠశాలల యాజమాన్యాలు అనుమతించడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి.

Updated Date - Oct 07 , 2025 | 12:57 AM