వీధి వ్యాపారులకు ‘లోక్ కల్యాణ్ మేళా’
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:31 AM
వీధి వ్యాపారుల సంక్షేమం కోసం లోక్ కల్యాణ్ మేళా పేరుతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. వీధి వ్యాపారుల సంక్షేమం, అభివృద్ధి, తదితర కార్యక్రమాల కోసం మున్సిపల్ పరిపాలన శాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జగిత్యాల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వీధి వ్యాపారుల సంక్షేమం కోసం లోక్ కల్యాణ్ మేళా పేరుతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. వీధి వ్యాపారుల సంక్షేమం, అభివృద్ధి, తదితర కార్యక్రమాల కోసం మున్సిపల్ పరిపాలన శాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్తగా వీధి వ్యాపారాలు చేస్తున్న వారిని ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్బర్ నిధి (పీఎం స్వనిధి) పథకంలో చేర్చనున్నారు.
కార్యక్రమాలు ఇలా..
జిల్లాలో పునః రూపకల్పన చేసిన పీఎం స్వనిధి పథకం కింద కొత్తగా ధరఖాస్తులను ప్రోత్సహించనున్నారు. ఇప్పటికే మంజూరైన దరఖాస్తులకు రుణ పంపిణీ సులభతరం చేయడం, బ్యాంకుల్లోని పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించడం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సహకరంతో వీధి ఆహార విక్రేతలకు శిక్షణ ఇవ్వడం వంటివి జరుపుతారు. వీధి వ్యాపారుల కుంటుంబాల సామాజిక, ఆర్థిక వివరాలు సేకరించడం, వీధి విక్రేత సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, తగిన సంక్షేమ పథకాలతో ఆదాయం పెరిగేలా చేయడం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు.
రుణ పంపిణీ లక్ష్యం..
జిల్లాలో సుమారు 15,000 మంది వీధి వ్యాపారులకు రుణాలివ్వనున్నారు. ఇందులో తొలి విడత సుమారు 10,000 మందికి ఇప్పించనున్నారు. రెండో విడత సుమారు రెండు వేల మందికి ఇవ్వనున్నారు. తొలి విడతలోని వారికి ఇచ్చే రుణం 15,000 రూపాయలను సంవత్సర కాలంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రెండో విడత వారికి ఇచ్చే 25,000 రూపాయలను 18 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
500 మందికి శిక్షణ...
వీధి విక్రేతల్లో ఆహార పదార్థాల విక్రయించే వారికి నాణ్యమైన ఆహార పదార్థాలు, కల్తీ లేకుండా వినియోగించడం తదితర అంశాలపై రెండు విడతలుగా సుమారు 500 మందికి శిక్షణ ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్సు ఇప్పించనున్నారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ ఎగ్రిగేటర్లు (డీపీఏ), టౌన్ వెండింగ్ కమిటీలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎన్‌జీవోలు, విక్రేతల సంఘాలు, తదితర ఆర్గనైజేషన్లను భాగస్వామ్యం చేయనున్నారు.
కొత్త దరఖాస్తులకు ప్రోత్సాహం....
జిల్లాలో లోక్ కల్యాణ్ మేళాలో 212 కొత్త దరఖాస్తులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నా రు. ఇందులో రాయికల్ మున్సిపల్‌లో 25, ధర్మపురిలో 25, కోరుట్లలో 25, మెట్‌పల్లిలో 32, జగిత్యాలలో 105 దరఖాస్తులను ప్రోత్సహించనున్నారు. అదేవిధంగా జిల్లాలో 618 మందికి డిజిటల్ లావాదేవీల వ్యవహారంపై అవగాహన, 297 మందికి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మంజూరు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. జిల్లాలో వీధి వ్యాపారులకు ఇప్పటికే తొలి విడతలో 12,427 మందికి ఒక్కొక్కరికి 15000 రూపాయల చొప్పున, రెండో విడతలో 6,008 మందికి ఒక్కొక్కరికి 25,000 చొప్పున, మూడో విడతలో 1,870 మందికి ఒకొక్కరికి 50,000 రూపాయల చొప్పున రుణాలను పంపిణీ చేశారు.
సామాజిక భద్రత...
స్వ నిధి సే సమృద్ధిలో భాగంగా వీధి విక్రయదారులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పథకాల్లో లబ్ధిద్వారా సామాజిక భద్రత కల్పించనున్నారు. ఇందులో భాగంగా పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవన జ్యోతి బీమా యోజన, పీఎం శ్రమ యోగి మాన్‌ధన్ యోజన, పీఎం జన్‌ధన్ యోజన, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, జననీ సురక్ష యోజన, భవన నిర్మాణ కార్మికుల నమోదు, పీఎం మాతృ వందన యోజన తదితర కార్యక్రమాలు, పథకాలపై అవగాహన కల్పించి లబ్ధి చేకూర్చనున్నారు.