Share News

‘స్థానిక’ సందడి

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:16 AM

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ రావడంతోనే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది.

‘స్థానిక’ సందడి

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ రావడంతోనే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. మొదట పరిషత్‌ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఆశావాహులు ఆయా పార్టీల పెద్దల చుట్టూ టిక్కెట్ల కోసం తిరుగుతున్న సందర్భాలు ఒకవైపు కనిపిస్తుండగా మరోవైపు ఆయా పార్టీల అధిష్టానం సూచనల మేరకు పరిషత్‌ బరిలో గెలుపు గుర్రాలపై జిల్లా నాయకులు ఆరా తీస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 జడ్పీటీసీలు,123 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన క్రమంలో అందుకు అనుగుణంగా గెలుపు అభ్యర్థుల ఎంపిక కోసం సర్వేలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజెపీ జిల్లా నాయకులు అభ్యర్థులను రంగంలో దింపే పనిలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు అభ్యర్థులపై ప్రధానంగా దృష్టి పెట్టారు. స్థానికంగా పలుకుబడి ఉన్న వారిని బరిలోకి దింపడానికి చర్చలు జరుపుతున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ స్థానిక ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వివిధ అంశాలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుందని భావిస్తూ అభ్యర్థుల ఎంపికపై విభిన్న రీతిలో సర్వేలు చేశారు.

అనుకూలించిన రిజర్వేషన్లతో ముందుకు

జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లలో అనుకూలంగా మారిన ఆశావాహులు ఆయా పార్టీల పెద్దలు భరోసాతో గ్రామీణ ప్రాంతాల్లో మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రామాల్లో కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు ఇతర గ్రామ పెద్దలతో సమావేశాలు అవుతున్నారు. గతంలో రిజర్వేషన్లు అనుకూలించక ఈసారి కలిసి వచ్చిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకునే దిశగా ముందడుగు వేస్తున్నారు. ముందుగా మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో రిజర్వేషన్ల వారీగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బీజేపీ పార్టీలు అభ్యర్థుల జాబితాలను రూపొందిస్తూ అధిష్ఠానానికి పంపించే ప్రక్రియను చేపట్టింది. జిల్లాలో 12జడ్పీటీసీ స్థానాల్లో వచ్చిన రిజర్వేషన్లలో జడ్పీటీసీ స్థానాలు 12 ఉండగా ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు మూడు కేటాయించగా ఒకటి మహిళ, రెండు జనరల్‌, బీసీలకు ఐదు కేటాయించగా రెండు మహిళలకు, మూడు జనరల్‌, మూడు జనరల్‌ ఉండగా ఒకటి మహిళలకు, రెండు జనరల్‌ స్థానాలుగా ఉన్నాయి. జడ్పీ చైర్మన్‌ ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ చేశారు. 123 ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీలకు 7, ఎస్సీలకు25, బీసీలకు 56, జనరల్‌ 35 స్థానాలను కేటాయించారు. ఎంపీపీల రిజర్వేషన్లలో రుద్రంగి ఎస్టీ జనరల్‌, ముస్తాబాద్‌ ఎస్సీ మహిళ, కోనరావుపేట ఎస్సీ జనరల్‌, వేములవాడ రూరల్‌ ఎస్సీ జనరల్‌, ఇల్లంతకుంట బీసీ మహిళ, బోయినపల్లి బీసీ మహిళ, గంభీరావుపేట, వేములవాడ అర్బన్‌, ఎల్లారెడ్డిపేట బీసీ జనరల్‌, వీర్నపల్లి మహిళా జనరల్‌, చందుర్తి, తంగళ్ళపల్లి జనరల్‌ రిజర్వ్‌ చేశారు. 260 సర్పంచ్‌ స్థానాల్లో ఎస్టీలకు 30, ఎస్సీలకు53, బీసీలకు 101, జనరల్‌ 76 స్థానాలను కేటాయించారు.

పట్టు సాధించాలని పార్టీల దృష్టి

స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించాలని ఆయా పార్టీల అధిష్టానాలు దృష్టి పెట్టాయి. జిల్లాలో వేములవాడ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రాతినిధ్యం వహిస్తుండగా, సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ అధ్యక్షుడు కే తారక రామారావు ఎమ్మెల్యే ఉన్నారు. జిల్లాలోని బోయిన్‌పల్లి మండలం చొప్పదండి నియోజవర్గంలోఉంది ఇక్కడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇల్లంతకుంట మండలం మానకొండూరు నియోజకవర్గంలో ఉండగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు చాలామంది పోటీ పడుతూ ముందుకు రావడంతో అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం కష్టంగానే ఉంటుందని చర్చించుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌, బీజెపీ అన్ని స్థానాల్లో పోటీలో అభ్యర్థులు నిలిపేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండడంతో బీజెపీ స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించాలని ప్రయత్నాల్లో ఉంది. మరో రెండు

ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు

జిల్లాలో స్థానిక ఎన్నికల ఏర్పాట్లలో ముందుగా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమలు ఉండడంతో గ్రామాల్లో రాజకీయ పార్టీల గోడ రాతలు, జెండాలు, పోస్టర్లు ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం మొదటి విడత ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకు, రెండో విడత 12 నుంచి 16 తేదీ వరకు నామినేషన్లు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో తొలి విడతలో ఏడు జడ్పీటీసీలు, 65 ఎంపిటిసిలు, రెండో విడతలో ఐదు జడ్పీటీసీలు, 58 ఎంపీటీసీల ఎన్నికలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

Updated Date - Oct 07 , 2025 | 12:16 AM