స్థానికం.. గందరగోళం...
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:27 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 9తో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధిం చడంతో తాత్కాలికంగా ఎన్నికలకు బ్రేక్ పడింది. దీంతో బీసీలతోపాటు ఆశావహులు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 9తో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధిం చడంతో తాత్కాలికంగా ఎన్నికలకు బ్రేక్ పడింది. దీంతో బీసీలతోపాటు ఆశావహులు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకవచ్చిన జీఓ 9ని సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి సంఘం నాయకుడు మాధవరెడ్డి, తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలి సిందే. ఈ పిటిషన్‌పై రెండు రోజులుగా విచారణ సాగింది. పిటిషనర్లు, అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు జీఓ 9పై, ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయా లని పిటిషనర్లను ఆదేశించింది. ఆరు వారాల అనం తరం విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. దీంతో ఆరు వారాల వరకు ఇప్పుడున్న రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవు. అయితే హైకోర్టు ఇచ్చిన స్టేపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు, లేదంటే 50 శాతం రిజర్వేషన్లకు మించకుండా ఎన్నికలకు వెళ్లేందుకు అవ కాశాలున్నాయి. ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మాత్రం మరోసారి అన్ని స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఎన్నికలు నిర్వహించ వద్దని బీసీ సంఘాలు పట్టుబడుతున్నాయి. దీంతో ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారింది. హైకోర్టు నవంబర్ 20వ తేదీ తర్వాతనే ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్, పిటిషనర్లు దాఖలు చేసిన కౌంటర్లపై విచారించనున్నది. ఈ విచారణ నాలుగైదు రోజులు పట్టవచ్చని, ఆ వెంటనే తీర్పు వెల్లడించే అవకాశాలు లేవని రిజర్వు చేస్తే మాత్రం ఎన్నికల నిర్వహణకు మరికొన్ని రోజులు పట్టవచ్చని తెలు స్తున్నది. ఈ లోపు నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పూర్తి కానున్నది.
ఫ స్టేతో బీసీల్లో నిరాశ..
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీలు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. రిజర్వేషన్లపై ఈ నెల 8వ తేదీన తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆ మరుసటి రోజు నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకేసారి షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు రానున్న దని, మరుసటి రోజుకు వాయిదా వేసిన కూడా ఎన్నికల సంఘం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆశపడ్డారు. కానీ కోర్టు రిజర్వేషన్ల జీఓ, ఎన్నికల నోటిఫికేషన్లపై ఆరు వారాలపాటు స్టే విధిం చడంతో అంతా షాక్‌కు గురయ్యారు.
జిల్లాలోని మంథని, కమాన్‌పూర్, రామగిరి, ముత్తా రం, అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం మండలాల్లోని 7 జడ్పీటీసీ, 68 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిం చేందుకు అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆ మేరకు రామగిరి మండలం జల్లారం ఎంపీటీసీ స్థానా నికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలువాక ఓదెలు అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా ఒకే ఒక నామినేషన్ దాఖలయ్యింది. వాస్తవానికి చాలా మంది అభ్యర్థులు తొలి రోజు నామి నేషన్లు వేయాలని భావించారు. కోర్టు విచారణ మధ్యాహ్యం 2:30 గంటలకు ఉండడంతో ఏదో ఒకటి తేలుతుందని నామినేషన్లు వేయలేదు. ఒకవేళ స్టే విధించకపోతే నామినేషన్లు దాఖలయ్యేవి. ఈ ఎన్ని కలపై రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫి కేషన్‌ను రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేసే అవకాశాలున్నాయి.