Share News

నిండుకుండలా ఎల్‌ఎండీ

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:47 AM

కరీంనగర్‌ సమీపంలో 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్‌ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) ఉంది. అది ప్రస్తుతం పూర్తి స్థాయి సామర్థ్యంతో నీటితో కళకళలాడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నగర ప్రజలకు తాగునీరు పుష్కలంగా సరఫరా కావాలి.

నిండుకుండలా ఎల్‌ఎండీ

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ సమీపంలో 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్‌ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) ఉంది. అది ప్రస్తుతం పూర్తి స్థాయి సామర్థ్యంతో నీటితో కళకళలాడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నగర ప్రజలకు తాగునీరు పుష్కలంగా సరఫరా కావాలి. మండుటెండల్లోనూ కరీంనగర్‌లో ప్రతిరోజు లేదా రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా అయ్యేది. నాలుగేళ్ల క్రితం డ్యామ్‌లో నీటి నిల్వలు ఐదు టీఎంసీలకు చేరుకున్నా.. బూస్టర్‌పంపుసెట్లతో డ్యామ్‌ నుంచి నీటిని లిఫ్ట్‌చేసి శుద్ధిచేసిన నీటిని ప్రతిరోజు నల్లాల ద్వారా సరఫరా చేశారు. ప్రస్తుతం నగరంలోని పలు డివిజన్లలో ప్రతి రోజూ మంచినీటి సరఫరా జరుగడం లేదు. కొన్ని డివిజన్లలో ప్రతిరోజూ మంచినీటిని సరఫరా చేస్తున్నా లీకేజీలు, తక్కువ ఫ్రెషర్‌ తదితర సాంకేతిక కారణాలతో సరిపడా నీరు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు.

18 రిజర్వాయర్ల ద్వారా నీటి సరఫరా

ఎల్‌ఎండీని ఆనుకొని ఉన్న కోతిరాంపూర్‌ రిజర్వాయర్‌ పరిధిలో ప్రతిరోజు కాకుండా రోజు విడిచి రోజు నల్లానీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరపాలక సంస్థ నగర ప్రజలకు మంచినీటిని అందించేందుకు ప్రతి రోజూ ఎల్‌ఎండీ నుంచి 65 మిలియన్‌ లీటర్ల రా వాటర్‌ను తీసుకొని 34 ఎంఎల్‌డీ, 36 ఎంఎల్‌డి, 14 ఎంఎల్‌డి సామర్థ్యం కలిగిన మూడు ఫిల్టర్‌బెడ్స్‌లో వాటిని శుద్ధి చేస్తారు. ఆ నీటిని లో లెవల్‌, హైలెవల్‌ పరిధిలోని 18 రిజర్వాయర్ల ద్వారా సరఫరా చేస్తారు.

ఫ పలు ప్రాంతాల్లో అరకొరగా సరఫరా..

గతంలో 48 ఎంల్‌ఎండీ నీటిని డ్రా చేసిన సమయంలోనే నగరమంతటా ప్రతిరోజూ దాదాపు 45 నిమిషాలపాటు సమయపాలనతో నల్లా నీటిని అందించారు. ప్రస్తుతం 65 ఎంల్‌ఎండీ నీటిని డ్రా చేస్తున్నా నగరంలోని దాదాపు 10 నుంచి 15 డివిజన్లలో ప్రతిరోజూ కాకుండా రోజు విడిచి రోజు నల్లా నీటిని అందిస్తున్నారు. జ్యోతినగర్‌, అంబేద్కర్‌నగర్‌, కోతిరాంపూర్‌ రిజర్వాయర్ల పరిధిలోని జ్యోతినగర్‌, చైతన్యపురి, ముకరంపుర, కోర్టు ప్రాంతంలోని వావిలాపల్లి, అంబేద్కర్‌ నగర్‌, కిసాన్‌నగర్‌, కోతిరాంపూర్‌ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా మున్సిపల్‌ నల్లానీటిపైనే ఆధారపడతారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో రోజు విడిచి రోజు, అదీగంట సేపు కూడా నల్లానీరు రావడం లేదు. దీంతో నీటికోసం ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. డ్యామ్‌లో నీరు సమృద్ధిగా ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని అంటున్నారు. తమకు ప్రతిరోజు నల్లానీటిని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తగ్గిన పంపింగ్‌ సమయం

శుద్ధి చేసిన నీటిని రిజర్వాయర్లలోకి మోటార్ల ద్వారా పంపింగ్‌ చేసుకునే సమయాన్ని రాత్రి 10 గంటల వరకు మాత్రమే కొనసాగిస్తున్నారు. రాత్రి 11.30 గంటల వరకు మోటార్లను రన్‌ చేస్తే ప్రతి రోజు నగరంలోని అన్ని ప్రాంతాలకు నల్లా నీటిని అందించే అవకాశాలున్నాయి. ఇంజనీరింగ్‌ అధికారులు సమయపాలనపై దృష్టి పెట్టకపోవడంతో మోటార్లను రాత్రి 10 గంటల వరకే రన్‌ చేసి ఆఫ్‌ చేయడం వంటి కారణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఇప్పటికైనా నగరపాలక సంస్థ కమిషనర్‌ నగరంలోని అన్ని డివిజన్లలో ప్రతిరోజూ మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని, లీకేజీలతో శుద్ధిచేసిన నీరు వృధాగా పోకుండా ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయించాలని నగరవాసులు, మాజీ కార్పొరేటర్లు కోరుతున్నారు.

ప్రతీ రోజు నల్లానీరు ఇప్పించండి

- మాజీ కార్పొరేటర్లు

నగరంలోని జ్యోతినగర్‌, కోతిరాంపూర్‌ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా ప్రతిరోజు నల్లా నీరు రావడం లేదని, ఎల్‌ఎండీలో సమృద్ధిగా నీరు ఉన్నందున ప్రతి రోజు తమ డివిజన్లలో నల్లానీరు సరఫరా అయ్యేలా చూడాలని మాజీ కార్పొరేటర్లు గందె మాధవి మహేశ్‌, జంగిలి ఐలేందర్‌యాదవ్‌ కోరారు. ఈ మేరకు శనివారం వారు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ని కలిసి వినతిపత్రం సమర్పించారు. నల్లానీటిపైనే తమ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా ఆధారపడతారని, డ్యామ్‌లో నీరు తక్కువగా ఉన్న సమయంలోనే ప్రతిరోజూ నీరు ఇచ్చారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రోజూ మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Updated Date - Dec 21 , 2025 | 12:47 AM