Share News

ఖనిలో న్యాయవాదిపై దాడి

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:40 PM

గోదావరిఖనికి చెందిన న్యాయవాది గూళ్ల రమేష్‌పై దాడి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. గాంధీనగర్‌లోని కోర్టు నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

ఖనిలో న్యాయవాదిపై దాడి

కోల్‌సిటీ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని కొత్త కూరగాయల మార్కెట్‌ వద్ద ఆదివారం రాత్రి న్యాయవాది గూళ్ల రమేష్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపర్చినట్టు వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. చాంద్‌పాషా, దయాకర్‌ అనే ఇద్దరు వ్యక్తులు కేసు గురించి మాట్లాడేది ఉందని చెప్పి న్యాయవాది గూళ్ల రమేష్‌ను పిలిచారని, మాట మాట పెరిగి రమేష్‌ తలపై బీరు సీసాతో దాడి చేయడంతో రమేష్‌ తలకు తీవ్ర గాయమైనట్టు చెప్పారు. అతడిని గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్టు, రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహిన్‌ అలియాస్‌ చాంద్‌పాషా, దయాకర్‌లపై ఎస్‌సీ, ఎస్‌టీ కేసు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు.

న్యాయవాదుల నిరసన

మార్కండేయకాలనీ, (ఆంధ్రజ్యోతి): గోదావరిఖనికి చెందిన న్యాయవాది గూళ్ల రమేష్‌పై దాడి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. గాంధీనగర్‌లోని కోర్టు నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తౌటం సతీష్‌ మాట్లాడుతూ రోజు రోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదులపై దాడి చేయడం సరైంది కాదన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బార్‌ అసోసియేషన్‌ నాయకులు ముచ్చకుర్తి కుమార్‌, దేశెట్టి అంజయ్య, ప్రదీప్‌కుమార్‌, బల్మూరి అమరేందర్‌రావు, మేడ చక్రపాణి, శైలజ, రంగు శ్రీనివాస్‌, సుజాత, రేష్మా, వెంకటేష్‌, వేల్పుల అరుణ్‌ కుమార్‌, ప్రకాష్‌, శ్రీనివాస్‌, తిలక్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2025 | 11:40 PM