Share News

కుందనపల్లి టు ఖమ్మం

ABN , Publish Date - Feb 10 , 2025 | 12:05 AM

జిల్లాలోని కుందనపల్లిలో గల ఎన్టీపీసీ యాష్‌ పాండ్‌ నుంచి నిత్యం వందలాది బూడిద లారీలు ఓవర్‌ లోడ్‌తో వెళుతున్నా సంబంధిత రవాణా శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. లారీల నుంచి బూడిద పడుతుండడంతో వాహనదారులు, పెద్దపల్లి పట్టణంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బూడిద కళ్లల్లో పడు తుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి.

కుందనపల్లి టు ఖమ్మం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని కుందనపల్లిలో గల ఎన్టీపీసీ యాష్‌ పాండ్‌ నుంచి నిత్యం వందలాది బూడిద లారీలు ఓవర్‌ లోడ్‌తో వెళుతున్నా సంబంధిత రవాణా శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. లారీల నుంచి బూడిద పడుతుండడంతో వాహనదారులు, పెద్దపల్లి పట్టణంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బూడిద కళ్లల్లో పడు తుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో బూడి దను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో కాంట్రాక్టర్లు, లారీల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై బూడిద పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు తరలింపు

రామగుండం ఎన్టీపీసీలో బొగ్గు ఆధారితంగా విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నది. బొగ్గు కాల్చడం వల్ల వెలువడే బూడిద కోసం కుందనపల్లి వద్ద 500 ఎకరాల్లో యాష్‌ పాండ్‌ను నిర్మించారు. ఇందులో పెద్ద ఎత్తున బూడిద నిల్వలు ఉన్నాయి. ఈ పాండ్‌ నుంచి సింగరేణికి ఉచి తంగా బూడిదను తరలించుకుపోతున్నారు. భూగర్భ గనుల్లో బొగ్గును వెలికి తీసిన తర్వాత వాటిని బూడిదతో నింపుతున్నారు. జాతీయ రహదారుల నిర్మా ణంలో బూడిదను వాడుతున్నారు. సింగరేణి, జాతీయ రహదారులకు బాటమ్‌ యాష్‌ను వినియోగిస్తున్నారు. 2028 నాటికి యాష్‌ పాండ్‌లో బూడిదను ఖాళీ చేసేందుకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే (జాతీయ రహదారులు)ల నిర్మాణంలో బాటమ్‌ యాష్‌ను వాడాలని కేంద్ర ప్రభు త్వం నిర్ధేశించింది. ఆ మేరకు ఎక్కడైతే జాతీయ రహ దారులను నిర్మిస్తున్నారో, దానికి సమీపంలోని పవర్‌ ప్లాంట్‌ల నుంచి ఉచితంగా బాటమ్‌ యాష్‌ను తీసుకు నేందుకు వెసలుబాటు కల్పించింది. దీంతో ఖమ్మం ప్రాంతంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవేల నిర్మాణాల కోసం కుందనపల్లిలో గల ఎన్టీపీసీ యాష్‌ పాండ్‌ నుంచి పది మాసాలుగా బూడిదను తరలిస్తున్నారు.

ఓవర్‌ లోడ్‌తో తరలింపు

కుందనపల్లి నుంచి ఖమ్మం వరకు దాదాపు 200 నుంచి 250 కిలోమీటర్ల దూరం లారీల్లో బూడిదను తరలిస్తున్నారు. ఒక్కో లారీలో నిబంధనలకు విరుద్ధంగా 50 నుంచి 60 టన్నుల వరకు బూడిదను తరలిస్తు న్నారు. రవాణా చార్జీల భారాన్ని తగ్గించుకునేందుకు లారీల వాహనాల బాడీని ఎత్తుకు పెంచి వాటి సామ ర్ధ్యానికి మించి ఒక్కో లారీలో 20 నుంచి 30 టన్నుల బూడిదను అదనంగా తీసుకు వెళుతున్నారు. కుందన పల్లి యాష్‌ పాండ్‌ నుంచి బసంత్‌నగర్‌, పెద్దపల్లి కరీంనగర్‌ బైపాస్‌ హుజూరాబాద్‌, వరంగల్‌ మీదుగా ఖమ్మం జిల్లాలకు లారీలు వెళుతున్నాయి. ఎన్టీపీసీ బూడిదను నేషనల్‌ హైవే కోసం ఉచితంగానే ఇస్తున్నప్పటికీ, కాంట్రాక్టర్లు మాత్రం ఓవర్‌ లోడ్‌తో తరలిస్తున్నారు. మూడు వాహనాల్లో తరలించే బూడిదను రెండు వాహనాల్లోనే తరలిస్తున్నారు. దీంతో రోడ్లపై భారం పడుతున్నది. స్పీడ్‌ బ్రేకర్లు, గుంతలు, రోడ్లు దెబ్బతిన్న చోట్ల బూడిద వాహనాల్లోంచి కుప్పలు కుప్పలుగా కింద పడుతున్నది. లారీలపై కప్పాల్సిన టార్పాలిన్లు, కవర్లు సక్రమంగా కప్పక పోవడంతో బూడిద అంతా రోడ్డుపై పడుతున్నది. బూడిద గాలికి లేచి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర లారీలు, వ్యాన్లు, బస్సు డ్రైవర్ల కళ్లలో పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీల వెనుకాల వెళ్లే వాహనదారుల కళ్లల్లో బూడిద పడడం వల్ల అదుపు తప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాల వల్ల పలువురు గాయాల పాలయ్యారు. ఓవర్‌లోడ్‌తో బూడిద వాహనాలన్నీ రాజీవ్‌ రహదారి మీదుగా వెళు తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు అందడం వల్లనే పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రోజుకు 80 నుంచి 100 లారీల వరకు ఖమ్మం, తదితర ప్రాంతాలకు బూడిద తరలుతున్నది. ఓవర్‌ లోడ్‌తో వెళుతున్న వాహనాలు వేగంగా వెళుతున్న కారణంగా రోడ్డుపై విపరీతంగా బూడిద రాలుతున్నది. ఇప్పటికైనా సంబంధిత అధికా రులు స్పందించి ఓవర్‌ లోడ్‌ను నియంత్రించడంతో పాటు రోడ్డుపై బూడిద పడకుండా చూడాలని ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు, ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 10 , 2025 | 12:05 AM