కరీంనగర్ : నగరంలో నల్లాల సర్వే
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:39 AM
నగరంలో నల్లాల కనెక్షన్ల సర్వే కలకలం రేపుతోంది. అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఇంటింటి సర్వే జరుపాలని, పాసుబుక్‌లు లేని వారికి నోటీసులు జారీ చేసి సరైన పత్రాలను సమర్పించకుంటే సక్రమం చేసుకునేందుకు ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు.
కరీంనగర్ టౌన్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): నగరంలో నల్లాల కనెక్షన్ల సర్వే కలకలం రేపుతోంది. అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఇంటింటి సర్వే జరుపాలని, పాసుబుక్‌లు లేని వారికి నోటీసులు జారీ చేసి సరైన పత్రాలను సమర్పించకుంటే సక్రమం చేసుకునేందుకు ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. ఎన్ని ఇంచులకు డిపాజిట్ చెల్లించారు...ఎన్ని ఇంచుల కనెక్షన్‌తో నీటిని పొందుతున్నారనే వాటిని కూడా పరిశీలించాలన్నారు. దీంతో నగరపాలక సంస్థ అధికారులు ఇంటింటికి వెళ్ళి నల్లా సర్వే ప్రారంభించారు. గతంలో నల్లా కనెక్షన్ కోసం చెల్లించే డిపాజిట్‌తోపాటు నెలసరి బిల్లులనుకూడా ఆఫ్‌లైన్‌లోనే చెల్లించి పాసుబుక్కులో రాయడం, రశీదులు తీసుకోవడం జరుగుతుండేది. ప్రస్తుతం ఆఫ్‌లైన్ విధానాన్ని పూర్తిగా తొలగించి ఆన్‌లైన్‌లో నమోదు చేసి కనెక్షన్లు ఇస్తున్నారు. నెలవారీ బిల్లులను కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని సూచిస్తున్నారు. గతంలో చాలా మంది పాసుబుక్‌లోని ట్యాప్ నంబర్ ప్రకారం నెలసరి బిల్లులను చెల్లించినా వారి పేర్లు, ఆ ట్యాప్ నంబర్ ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. దీంతో వారిని ఆన్‌లైన్ చేసుకోవాలని సూచిస్తుండడంతో ఇప్పటి వరకు నెల వారీ బిల్లులు చెల్లించామని చెప్పినా బకాయిలను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు.
అపార్ట్‌మెంట్లకు పెరిగిన బిల్లులు
25లోపు ప్లాట్లు ఉన్న అపార్టుమెంట్లకు గతంలో 1,75,000 రూపాయలను డిపాజిట్‌గా తీసుకొని కమర్షియల్‌గా ముప్పావు ఇంచు నల్లాపైపులైన్‌తో కనెక్షన్ ఇచ్చే వారు. మొత్తం అపార్టుమెంట్లలో ఎన్ని ప్లాట్లు ఉన్నా నెలకు 750 నుంచి 900 రూపాయల వరకు బిల్లులను తీసుకున్నారు. అలాంటి వారందరికి ఇప్పుడు నోటీసులు జారీచేశారు. ఒక్కో ప్లాట్‌కు నెలకు 120 చొప్పున 25 ప్లాట్లు ఉంటే మూడు వేల రూపాయల బిల్లులను చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. అర ఇంచు పైపులైన్‌తో ఇళ్లకు కనెక్షన్లు ఇస్తూ నెలకు 100 రూపాయలు వసూలు చేస్తున్నారని, అపార్టుమెంట్ మొత్తానికి ముప్పావు ఇంచు నల్లా కనెక్షన్ ఇచ్చి మూడు వేలు చెల్లించాలనడం ఎంత వరకు సమంజమని అంటున్నారు. ప్లాట్ వైజ్‌గా నల్లాబిల్లులు వసూలు చేస్తే మరి అన్నింటికి అర ఇంచు సైజుతో నల్లా కనెక్షన్ ఇస్తారా ఇస్తే నెలకు 100 రూపాయలు చెల్లిస్తామని చెబుతున్నారు. కొన్ని చోట్ల హాఫ్ ఇంచు కనెక్షన్ తీసుకొని ముప్పావు ఇంచు, మరికొన్ని చోట్ల ఇంచుతో ఉన్న కనెక్షన్లు బయటపడుతుండడంతో వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఇళ్లకు వెళ్లి పాసుబుక్కులు లేని వారు ఇప్పటి వరకు చెల్లించిన డబ్బులతో సంబంధం లేకుండా బకాయిలన్నింటిని చెల్లించాలని చెబుతున్నారు. గతంలో పాసుబుక్కులను ఇవ్వడంతోనే బిల్లులు చెల్లించామని, ఇప్పుడు వాటిని పరిగణలోకి తీసుకోకుండా బకాయిలన్ని కట్టాలనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రికార్డులు లేవని, అక్రమ నల్లాలుగా గుర్తించామని సక్రమం చేసుకోవాలంటూ వేలల్లో ఖర్చు అవుతుందంటూ కిందిస్థాయి ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోవైపు కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లకు కనెక్షన్లు ఇచ్చినట్లు తేలుతున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా నల్లాల సర్వే కలకలం రేపుతోంది.