ఉద్యోగభద్రత లేక ఫీల్డ్‌అసిస్టెంట్ల వెతలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:54 AM
ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయడంలో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషించే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పించి పే స్కేల్ వర్తింప చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈనెల 14 తేదీ నుంచి దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణయించారు. ఆ మేరకు ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.

పెద్దపల్లి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకవచ్చింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం కూలీలు వలస వెళ్ళకుండ ఉండడమే. ఈ పథకంలో ప్రతీ కుటుంబానికి వందరోజుల పని దినా లను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్రంలో 53.09 లక్షల జాబ్ కార్డులను ఉపాధిహామీ కూలీలకు జారీ చేయగా, అందులో కోటి 10 లక్షల 77వేల మంది ఉన్నారు. రెగ్యులర్ గా 50 లక్షల మందికిపైగా కూలీలు ఉపాధిహామీ పథ కంపై ఆధారపడి జీవిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధి కూలీలకు పనులు కల్పించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారితో పాటు మహిళలు, దివ్యాంగులు ఎక్కువగా ఉన్నారు. వెలుగు ప్రాజెక్టు ద్వారా సెర్ఫ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉద్యోగ భద్రత కల్పించారు. అదే తరహాలో తమకు కూడా పే స్కేల్ వర్తింప జేయాలని కోరుతున్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల విధులు ఇలా..
ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాల్లో ఏడాదికి సరిపడా ఉపాధి పనులను గుర్తించి జాబు కార్డులు కలిగిన కూలీలకు పనులు కల్పించాలి. పనులు జరిగే చోట ఉదయం, సాయంత్రం ప్రత్యేక యాప్‌లో కూలీల హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల్లోని నర్సరీ లను, ఏడు రకాల రిజిస్టర్లను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, ఇతర పనుల్లో వీరి సేవలను వినియోగించుకుంటారు. గ్రామ పంచాయతీలో కార్యదర్శులకు సహాయంగా ఉంటారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాల్లో కూడా మీరు భాగస్వాములుగా ఉంటున్నారు.
అరకొర వేతనం
ఫీల్డ్ అసిస్టెంట్లను మూడు కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం వేతనాలు అందజేస్తున్నది. మొదటి కేట గిరీలో నెలకు 10 వేలు, రెండో కేటగిరీలో 11 వేలు, మూడో కేటగిరిలో 9 వేల రూపాయల వేతనం ఇస్తున్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా అక్కడి ప్రభు త్వాలు గుర్తించి వేతనాలను అందజేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్లుగా గుర్తించి నెలకు 18 వేల రూపాయల వేతనాన్ని అందజేస్తున్నది. తమకు కూడా ఉద్యోగ భద్రత కల్పించి పేస్కేల్ వర్తింపచేయాలని కొంతకాలంగా ఆయా ప్రభుత్వాలకు విన్నవిస్తున్నారు. కానీ వారి సమస్యలు నేటికీ తీరలేదు. 18 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో తమ జీవితాలను నెట్టుకువస్తున్నారు.
ఉపాధి పనుల్లో నిధుల కేటాయింపు
ఉపాధిహామీ పథకానికి కేటాయించిన నిధుల్లో 60 శాతం కూలీలకు, 40 శాతం మెటీరియల్ కంపోనెంట్ కింద వెచ్చించాలని నిబంధనలు రూపొందించారు. యేటా రాష్ట్రంలో ఉపాధిహామీ పనులను పెంచడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కృషి చేస్తున్నారు. కూలీలకు ఎంత ఎక్కువ పనులు కల్పిస్తే మెటీరియల్ కాంపోనెంట్ నిధులు పెరుగుతాయి. 2024-25లో 4344 కోట్ల రూపా యల వేతనాలు కూలీలకు చెల్లించగా, మెటీరియల్ కాంపోనెంట్ కింద 2614 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు, మురికి కాలువలు, అంగన్వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. యేటా 2 వేల నుంచి 2600 కోట్ల రూపాయల వరకు శాశ్వత నిర్మాణ పనులు గ్రామాల్లో చేపట్టేందుకు ప్రభుత్వానికి మేలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా వారికి ఉద్యోగ భద్రత కల్పించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈనెల 14వ తేదీ నుంచి దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించి పేస్కేల్ వర్తింపచేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు కోరుతున్నారు.