బోధనకు సమయమేదీ
ABN , Publish Date - Aug 17 , 2025 | 01:13 AM
ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు బోధనేతర పనులతో సమయం గడిచిపోతోంది. ఒకప్పుడు పాఠ్యాంశాలు బోధిస్తూ తీరిక లేకుండా గడిపే ఉపాధ్యాయులు నేడు యాప్, ఆన్‌లైన్ పనులతో కుస్తీ పడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరవుతున్నారు.
కరీంనగర్ టౌన్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు బోధనేతర పనులతో సమయం గడిచిపోతోంది. ఒకప్పుడు పాఠ్యాంశాలు బోధిస్తూ తీరిక లేకుండా గడిపే ఉపాధ్యాయులు నేడు యాప్, ఆన్‌లైన్ పనులతో కుస్తీ పడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరవుతున్నారు. రాష్ట్ర విద్యాశాఖతో పాటు జిల్లా, మండల స్థాయి అధికారులు అడిగే నివేదికలు పంపేందుకే ఉపాధ్యాయులు సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థుల వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయడం లేదని పలువురు హెచ్‌ఎంలకు జిల్లా విద్యాశాఖ మెమోలు జారీ చేసింది.
ఫ సగం సమయం ఆన్‌లైన్‌కే
ప్రతీ రోజూ పాఠశాలలో ప్రార్థన నుంచే ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ పని మొదలవుతుంది. డీఎస్‌ఈ, ఎఫ్‌ఆర్‌ఎస్ (డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం) ద్వారా విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. దీనికి అరగంట నుంచి గంట వరకు సమయం కేటాయించాలి. ఎంపిక చేసిన పాఠశాలల్లో అల్పాహారం, మిగతా పాఠశాలల్లో రాగి జావ పెట్టేందుకు మరొక గంట సమయం పడుతుంది. మొదటి రెండు పీరియడ్లు గడచిన తర్వాత మధ్యాహ్న భోజనానికి గంట సమయం కేటాయించాల్సి వస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో గత ఏడాది ప్రవేశపెట్టిన తొలిమెట్టు, ఈ ఏడాది నుంచి ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఉన్నతి కార్యక్రమాల నిర్వహణ, వాటి పరిక్షలకు పాఠ్య ప్రణాళిక తయారీ, బోధనా ఉపకరణాలను సమకూర్చాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషన్ లిటరసి న్యూమరసి), ఎల్‌ఐపి (లర్నింగ్ ఇప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం) విద్యార్థుల వివరాలను యూడైస్‌ప్లస్‌లో నమోదు చేయడం, కంప్యూటర్ల నిర్వహణ తదితర కార్యక్రమాలుంటాయి.
ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు
మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ బాధ్యతలంటే ఉపాధ్యాయులు జంకుతున్నారు. గతేడాది వివిధ పాఠశాలలకు చెందిన పలువురు ప్రధానోపాధ్యా యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక వైపు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం వడ్డించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. మరోవైపు సకాలంలో బిల్లులు రాకపోవడంతో నిర్వాహకులు మెనూ పాటించలేని పరిస్థితి ఉంది. మంచినీటి వసతి, సరైన వంటపాత్రలు లేక చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భాలున్నాయి. వీటన్నిటికీ ప్రధానోపాఽధ్యాయులే కారణంగా చూపుతూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.