పల్లెలకు మీ సేవలు లేనట్లేనా?
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:47 AM
ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నా, ఉద్యోగాలకు, విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పొందాలన్నా ‘మీసేవ’ కేంద్రాలు వారధిగా మారాయి. ఈక్రమంలోనే గ్రామీణ ప్రజలకు మీసేవ కేంద్రాల ద్వారా పౌర సేవలను మరింత సులభతరం చేయాలని గత సంవత్సరం ప్రభుత్వం కరత్తు ప్రారంభించింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నా, ఉద్యోగాలకు, విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పొందాలన్నా ‘మీసేవ’ కేంద్రాలు వారధిగా మారాయి. ఈక్రమంలోనే గ్రామీణ ప్రజలకు మీసేవ కేంద్రాల ద్వారా పౌర సేవలను మరింత సులభతరం చేయాలని గత సంవత్సరం ప్రభుత్వం కరత్తు ప్రారంభించింది. అదేక్రమంలో మహిళలకు ఆర్థిక చేయూతను అందించే దిశగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా మీసేవ కేంద్రాలను నిర్వహించడానికి సన్నాహాలు చేపట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత సంవత్సరం జూలైలో మహిళా శక్తి పథకంలో మీసేవ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చినా దరఖాస్తుల స్వీకరణతోనే ప్రక్రియ నిలిచిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో పౌర సేవలు మరింత చేరువవుతాయని ప్రజలు భావించారు. మీసేవ కేంద్రాల ఏర్పాటు దరఖాస్తుల స్వీకరణతోనే నిలిచిపోవడంతో దరఖాస్తుదారులు నిరాశ చెందుతున్నారు.
జిల్లాలో పది కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో ప్రస్తుతం 108 మీసేవ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మహిళా శక్తి పథకం ద్వారా గ్రామైక్య సంఘం, పొదుపు సంఘాల సభ్యులకు మీసేవ కేంద్రాలను అందించే దిశగా నిర్ణయించారు. ఇందులో భాగంగా మహిళా శక్తి పథకం కింద జిల్లాలో పది మీసేవ కేంద్రాలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుకు మంజూరు చేశారు. మీసేవ కేంద్రాల ఏర్పాటు చేయడానికి గ్రామాలను ఎంపిక చేశారు. మీసేవ కేంద్రాల నిర్వహణకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. పొదుపు సంఘం సభ్యుల్లో ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారి నుంచి ఎంపిక ప్రక్రియను చేపట్టారు. గత సంవత్సరం ఆగస్టు 15 నాటికే మీ సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీసేవ కేంద్రాలు ప్రభుత్వ భవనాలు, గ్రామపంచాయతీలు, మహిళా సంఘం భవనాలు, కమ్యూనిటీ భవనాలు, యువజన సంఘం భవనాలను ఉపయోగించుకునే విధంగా మార్గదర్శకాలను ఇచ్చింది. కానీ మీసేవ కేంద్రాలు దరఖాస్తు దశలోనే నిలిచిపోయాయి.
మీసేవ కేంద్రాలకు రుణ సాయం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండల సమాఖ్య, 411 మహిళా గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1.51 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాల పరిధిలో సంఘం తీర్మానం మేరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గ్రామీణ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావించిన మీసేవ కేంద్రాల ఏర్పాటుకు స్ర్తీనిధి ద్వారా రూ 2.50 లక్షలు రుణ సాయం కూడా అందించాలని ప్రభుత్వం సిఫార్సు చేసింది. రుణంతో మీసేవ కేంద్రం ఏర్పాటుకు కావలసిన కంప్యూటర్, ప్రింటర్, కెమెరా, ఇంటర్నెట్ బయోమెట్రిక్, టేబుల్, కుర్చీలు వంటివి సమకూర్చుకోవాలని సూచనలు చేసింది, మీసేవ కేంద్రాల ద్వారా 40 రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావాల్సి ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నిరాశే మిగిలింది.
మీ సేవ కేంద్రాలపై దృష్టి
జిల్లాలోని 108 మీసేవ కేంద్రాలపై నిరంతరం అధికారులు దృష్టి సారిస్తున్నారు. గత సంవత్సరం నుంచి నగదు రహిత చెల్లింపుల విధానం అమల్లోకి తెచ్చారు. ప్రజలు పౌర సేవలు పొందుతున్న క్రమంలో నిర్ణీత ఫీజు కంటే ఎక్కువగా నిర్వాహకులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో క్యూఆర్ కోడ్ ద్వారా నగదు రహిత చెల్లింపులు విధానాన్ని అమలులోకి తెచ్చారు. మీసేవ కేంద్రాల ద్వారా క్షేత్రస్థాయిలో సేవలు మరింత పెంచే దిశగా మహిళా శక్తి మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.