ఆర్‌ఎఫ్‌సీఎల్ షట్ డౌన్‌పై ఆరా!
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:55 PM
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) తరచూ షట్ డౌన్ అవుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షట్ డౌన్ ఎందుకు అవుతుందనే విషయమై ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్లాంట్ ద్వారా ఈ నెలాఖరు వరకు రాష్ట్రానికి 65 వేల టన్నుల యూరి యా రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 20 వేల టన్నులు మాత్రమే సరఫరా అయ్యింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) తరచూ షట్ డౌన్ అవుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షట్ డౌన్ ఎందుకు అవుతుందనే విషయమై ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్లాంట్ ద్వారా ఈ నెలాఖరు వరకు రాష్ట్రానికి 65 వేల టన్నుల యూరి యా రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 20 వేల టన్నులు మాత్రమే సరఫరా అయ్యింది. జూలై నుంచి వరి సాగవుతున్న సమయంలోనే ఒక్కసారిగా యూరియా కొరత ఏర్పడింది. ఇందుకు కారణం ఆర్‌ఎఫ్‌సీఎల్ తరచూ షట్‌డౌన్ అవుతుండడమేనని తెలుస్తున్నది. ఈ ఏడాది మే 8 నుంచి జూన్ 15 వరకు, జూలై 16 నుంచి ఆగస్టు 4 వరకు ఉత్పత్తి నిలిచిపోయింది. మళ్లీ ఆగస్టు 14న అమ్మోనియా లీకేజీతో ప్లాంట్ షట్‌డౌన్ అయ్యింది. ఈ వరుస వైఫల్యాలతో తెలంగాణకు లక్ష టన్నులకు పైగా యూరియా సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ నెలలో 65 వేల టన్నులు సరఫరా జరగాల్సి ఉంది. యూరియా కొరతతో రైతులు బ్బందులు పడుతున్నారు. ఇందుకు గల కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా ఆరా తీస్తున్నది. కావాలనే పరిశ్రమను షట్ డౌన్ చేస్తున్నారా, సాంకేతిక కారణాల వల్ల షట్ డౌన్ అవుతున్నదా, అమ్మోనియా లీక్‌తోనే షట్‌డౌన్ అవుతున్నదా, పరిశ్రమలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యంతోనే తరచూ లీకేజీలు తలెత్తు తున్నాయా, రాజకీయ కుట్రల కారణంగా షట్ డౌన్ అవుతున్నదా అనే కోణాలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. రామగుండంలో మూతపడిన ఎఫ్‌సీఐని నేషనల్ ఫెర్డిలైజర్స్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ, డెన్మా ర్కు చెందిన హాలర్ టాప్స్ భాగస్వామ్యంతో ఆర్‌ఎఫ్‌సీ ఎల్ పునరుద్ధరించారు. యేటా 12 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంతో ప్రాజెక్టును నిర్మించారు. 2021 నుంచి ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభమైంది. ఇందులో తెలంగాణకే 45 శాతం యూరియా సరఫరా చేసే విధంగా కేంద్రం ప్రణాళిక చేసింది. అయితే ఈ ఏడాది లక్ష్యం మేరకు యూరియా సరఫరా కావడం లేదు. తరచూ సాంకేతిక అవరోధాలతో ప్లాంట్ షట్ డౌన్ ఆయి ఉత్పత్తి నిలిచి పోతుండడంతో సకాలంలో యూరియా సరఫరా కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల కాలంలో మూడుసార్లు షట్ డౌన్ కావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరి గణిస్తున్నది. జిల్లాలో పెద్దగా యూరియా కొరత లేకున్నప్పటికీ, ఇతర జిల్లాల్లో కొరత ఏర్పడింది. మరో 15 రోజుల్లో వరి పంట కలుపు తీసిన తర్వాత రెండో విడత యూరియా చల్లుతారు. రైతులు యూరియా కోసం సహకార సంఘాల వద్ద బారులు తీరుతున్నారు. కొరతను ఆసరా జేసుకుని ప్రైవేట్ వ్యాపారులు ఒక్కో యూరియా బస్తాను ఎమ్మార్పీ కంటే 30 నుంచి 40 రూపాయలు అదనంగా విక్రయిస్తున్నారు. షట్ డౌన్ అయిన ప్లాంట్‌లో తిరిగి ఉత్పత్తి చేపట్టేందుకు వారం, పది రోజులు పట్టే అవకాశాలున్నాయి. షట్ డౌన్ ఎందుకు అవుతుందనే విషయాన్ని తెలుసుకునేందుకు శనివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను సందర్శించారు. సీఈఓ అలోక్ సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణకు రావాల్సిన 50 శాతం కోటా యూరియాను తగ్గించి ఇవ్వడానికి గల కారణాలు, తదితర అంశాలపై చర్చించారు. అయితే ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో నాణ్యత లేని అమ్మోనియా పైప్‌లైన్ లీకేజీలతో ఉత్పత్తికి అవరోధం ఏర్పడుతున్నదని, దీనిపై సీబీఐచే కేంద్రం విచారణ జరపాలని డిమాండ్ చేశారు.