లాభాల వాటా పంపిణీలో కార్మికులకు అన్యాయం
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:55 PM
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటాలో అన్యాయం జరిగిందని సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో జరుగనున్న బతుకమ్మ కార్యక్రమానికి వెళుతున్న కవిత మంగళవారం మున్సిపల్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గోదావరిఖని, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటాలో అన్యాయం జరిగిందని సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో జరుగనున్న బతుకమ్మ కార్యక్రమానికి వెళుతున్న కవిత మంగళవారం మున్సిపల్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన లాభాల వాటాపై రాజకీయ రంగు పులమడం సరైంది కాదని, రెండు సంవత్సరాలుగా సింగరేణికి వస్తున్న లాభాల్లో తప్పుడు లెక్కలు చూపిస్తూ కార్మికులను శ్రమదోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు. గని కార్మికులు చిందిస్తున్న చెమట చుక్కలతోనే తెలంగాణలో ప్రతి ఇంట లైటు, ఫ్యాను, ఏసీలు తిరుగుతున్నాయని, ప్రభుత్వం మానవీయ కోణాన్ని పక్కకు పెట్టి శ్రమ దోపిడీకి పాల్పడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించే రోజులు దగ్గర పడ్డాయని, లోకల్‌లో చేయాల్సిన అపాయిమెంట్లు కూడా జీఎం స్థాయిలో చేయడమేమిటని మండిపడ్డారు. లాభాల వాటా కార్మికుల హక్కు అని, ఏదో బిక్షం వేసినట్టు మాట్లాడడం సరైంది కాదని, దీనిపై ముఖ్యమంత్రి పునః సమీక్షించుకోవాలని కోరారు. అధ్యక్షులు రియాజ్ అహ్మద్, నాయకులు లావుడ్య వెంకటేష్, నిట్టూరి రాజు, దావు రమేష్ పాల్గొన్నారు.