Share News

పెరుగుతున్న చలి తీవ్రత

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:42 AM

జిల్లాలో చలి మొదలైంది.. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం వేళలో ఈదురుగాలులు, మంచు కురుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం ఉదయం వరకు సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రత9.1 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 32.4 డిగ్రీలుగా నమోదయింది.

 పెరుగుతున్న చలి తీవ్రత

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

జిల్లాలో చలి మొదలైంది.. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం వేళలో ఈదురుగాలులు, మంచు కురుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం ఉదయం వరకు సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రత9.1 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 32.4 డిగ్రీలుగా నమోదయింది. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో రుద్రంగిలో 9.1 డిగ్రీలు, గంభీరావుపేటలో 9.9 డిగ్రీలు ,వీర్నపల్లిలో 10.7 డిగ్రీలు, బోయిన్‌పల్లిలో 11.1 డిగ్రీలు, చందుర్తిలో 11.2 డిగ్రీలు, తంగళ్ళపల్లిలో 11.2 డిగ్రీలు, వేములవాడరూరల్‌లో 11.3 డిగ్రీలు, కోనరావుపేటలో 11.4 డిగ్రీలు, ముస్తాబాద్‌లో 11.5 డిగ్రీలు, ఎల్లారెడ్డిపేటలో 11.5 డిగ్రీలు, సిరిసిల్లలో 12.1 డిగ్రీలు, వేములవాడలో 12.5 డిగ్రీలు, కోనరావుపేటలో 12.7 డిగ్రీలు, ఇల్లంతకుంటలో 15.2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డిసెంబర్‌ మాసంలో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. ఈసారి నవంబరులోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 9.30 గంటల వరకు కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాలు రోడ్లమీదికి రావడం లేదు. సాయంత్ర కూడా చలి తీవ్రతకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. చలి మంటలతో గ్రామాల్లో సేద తీరుతున్నారు. చల్లని గాలులకు పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాలకు కూరగాయలు, పాలు తీసుకువచ్చే రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

స్వెటర్లు, మఫ్లర్ల అమ్మకాల జోరు....

జిల్లా కేంద్రంలో వెచ్చదనం కోసం నూలు వస్త్రాల కొనుగోలు మొదలైంది. రాజస్థాన్‌, మహారాష్ట్ర నుంచి వచ్చిన చిరువ్యాపారులు సిరిసిల్లలో ప్రత్యేక గుడారాలు వేసుకొని దుకాణాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చే జనం మంకీ క్యాప్‌లు, సాక్స్‌లు, జర్కీన్‌లు, స్వెటర్‌లు, టోపీలు, మఫ్లర్లతో చలిని ఎదుర్కోవడానికి కొనుగోలు చేస్తున్నారు. ఏడాదిలోనే కేవలం ఈ మూడు నెలలల్లోనే చలికి తప్పనిసరిగా వాడే స్వెటర్లు కొనుగోలు చేస్తుంటారు. ఉన్నితో తయారుచేసిన దుస్తుల కొనుగోలుకు ఇష్టపడుతారు. ఈసారి ధరలు కొంత పెరిగినా ఆకర్షణీయమైన రంగుల్లో స్వెటర్లు అమ్మకాలకు ఉంచారు. చిన్నపిల్లల క్యాపులు రూ 50 నుంచి రూ 100 వరకు, సాక్స్‌లు రూ 25 నుంచి రూ 100వరకు, జర్కీన్‌లు రూ 100 నుంచి రూ 700 వరకు, పెద్దలకు స్వెటర్లు రూ 200 నుంచి రూ 1000 వరకు టోపీలు రూ 50 నుంచి రూ 150 వరకు, జర్కీన్‌లు రూ 500 నుంచి రూ 1500 వరకు, చెవుల క్యాపులు రూ 50 నుంచి రూ 100 వరకు, మహిళల క్యాపులు రూ 30 నుంచి రూ 110 వరకు, మప్లరు రూ 75 నుంచి రూ 200 వరకు లభిస్తున్నాయి.

శ్వాసకోశ ఇబ్బంది ఉంటే జాగ్రత్తలు పాటించండి..

- చలికాలంలో అస్తమా ఉన్న వారు నిత్యం వాడే మందులను ఎప్పుడూ సిద ్ధంగా ఉంచుకోవాలి.

- సిగరేట్‌ అలవాటు ఉన్నవారు మానివేయాలి.

- దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలి. చల్లని గాలికి ఎక్కువగా తిరగవద్దు. శ్వాసనాళాలు మూసుకుపోకుండా మందులు వాడాలి.

- ఇన్‌హేలర్‌, నెబిలైజర్‌ వంటి వాటిని కూడా వాడాలి. ముక్కుభాగంలో ఇన్‌ ఫెక్షన్‌ ఎక్కువై తెమడ పేరుకుపోయి ఇబ్బంది పడే వారు సిరప్‌లు వాడాలి.

- చలికాలంలో ద్విచక్రవాహనంపై ప్రయాణించే వారు హెల్మెట్‌ తప్పనిసరిగా ఉపయోగించాలి. స్వెట్టర్‌లను ధరించాలి.

చలిమంటలు.. జాగ్రత్తలు

చలికాలం అనగానే తెల్లవారుజామునే ఆరుబయట మంటలు వేసుకోవడం అలవాటు. మంటలు వేసుకునే సమయంలో చిన్నారులను దగ్గరకు వెళ్లకుండా చూసుకోవాలి. మహిళలు చీర కొంగులను జాగ్రత్తగా గమనించాలి. మంట వద్ద ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పదు.

Updated Date - Nov 15 , 2025 | 12:42 AM