Share News

ముఖ గుర్తింపుతో పెరిగిన హాజరు శాతం

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:27 AM

peddapalli ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంపుతోపాటు భవిష్యత్‌లో ప్రవేశాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో వలే జూనియర్‌ కళాశాలల్లోనూ ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమల్లోకి తీసుక వచ్చింది.

ముఖ గుర్తింపుతో  పెరిగిన హాజరు శాతం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంపుతోపాటు భవిష్యత్‌లో ప్రవేశాలను పెంచేందుకు, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో వలే జూనియర్‌ కళాశాలల్లోనూ ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమల్లోకి తీసుక వచ్చింది. రోజు రెండు సార్లు, తరగతుల ఆరంభానికి ముందు ఒకసారి, తరగతులు ముగిసిన తర్వాత ఒకసారి ముఖ గుర్తింపు హాజరు తీసుకుం టున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను కళాశాలల అధ్యాపకుల మొబైల్‌ ఫోన్లను డౌన్‌లోడ్‌ చేసి హాజరు తీసుకుంటున్నారు. విద్యార్థులే గాకుండా, అధ్యాపకులు, ఇతర సిబ్బందికి కూడా ముఖ గుర్తింపు హాజరును తప్పనిసరి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అమలు చేస్తున్నారు. పది రోజుల నుంచి దీనిని అమల్లోకి తీసుకవచ్చారు.

జిల్లాలో పెద్దపల్లి బాలుర, బాలికల, మంథని బాలుర, బాలికల, గోదావరిఖని బాలుర, బాలికల, రామగుండం, సుల్తానాబాద్‌, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, కమాన్‌పూర్‌, ధర్మారం, జూలపల్లి, ముత్తారం మండ లాల్లో 14 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ వంటి కోర్సులతోపాటు వొకేషనల్‌ కోర్సులను కూడా బోధిస్తున్నారు. ప్రథమ సంవత్సరంలో 3,843 మంది, ద్వితీయలో 3,469 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే సదరు విద్యార్థులు రెగ్యులర్‌గా కళాశాలలకు హాజరు కావడం లేదని, హాజరైనా అన్ని తరగతులు పూర్తయ్యే వరకు ఉండడం లేదని గమనించిన ప్రభుత్వం ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను తీసుకవచ్చింది. ఈ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా మొదట పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరంభించారు. ఆ తర్వాత ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. ముఖ ఆధారిత గుర్తింపు విధానం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగింది. దీంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశపెట్టాలని భావించిన ప్రభుత్వం జిల్లాలో 10 రోజుల నుంచి అమలు చేస్తున్నది. ఈ విధానం ప్రవేశ పెట్టనప్పుడు ఏడాదిలో చాలా మంది విద్యార్థుల హాజరు శాతం 60 శాతానికి మించ లేదు. కానీ బోర్డు నిబంధనల ప్రకారం 75 శాతం హాజరు లేకుంటే వార్షిక పరీక్షలు రాసేందుకు అనర్హులు. కానీ అధ్యాపకులు ఏడాది పాటు సమయం వృథా కాకుండా ఉండేందుకు మానవతా దృక్పథంతో 75 శాతానికి పైగా విద్యార్థులు హాజరైనట్లుగా హాజరు చూపి పరీక్షలు రాసేందుకు దోహద పడ్డారు.

ఇక నుంచి 75 శాతం హాజరు తప్పనిసరి..

ఆయా కోర్సులు చదువుతున్న విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవ త్సరంలో ఇక నుంచి 75 శాతం హాజరు తప్పనిసరి చేశారు. విద్యార్థులు కళాశాలకు వస్తేనే హాజరు నమోదు అవుతుంది. అధ్యాపకులు, ఇతరులు ఎవరు కూడా విద్యార్థులు వచ్చినా రాకున్నా వచ్చినట్లు హాజరు వేయ కుండా ఉండేందుకే ముఖ ఆధారిత గుర్తింపు విధానాన్ని తీసుక వచ్చారు. విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయాలంటే, నిబంధనల ప్రకారం తప్పని సరిగా 75 శాతం హాజరు ఉండాలి. ముఖ ఆధారిత గుర్తింపు విధానం వచ్చిన తర్వాత కళాశాలల్లో గతంలో కంటే ప్రస్తుతం 10 శాతం వరకు విద్యార్థుల హాజరు పెరిగింది. హాజరు శాతం గురించి విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు అధ్యాపకులు అవగాహన కల్పిస్నున్నారు. గ్రూపుల వారీగా విద్యార్థులను విభజించి వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. 3, 4 రోజులపాటు వరుసగా కళాశాలకు రాకుంటే తల్లితండ్రులకు ఫోన్‌ చేసి ఆరా తీస్తున్నారు. 4 రోజులకు మించి హాజరు కాకపోతే అధ్యాపకులు విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లితండ్రులు, విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కళాశాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

ముఖ ఆధారిత గుర్తింపుతో పెరుగుతున్న హాజరు శాతం

- కల్పన, జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పది రోజులుగా అమలు చేస్తున్న ముఖ ఆధారిత గుర్తింపు విధానాన్ని అమలు చేయడం వల్ల 10 శాతం వరకు విద్యార్థుల హాజరు పెరిగింది. కళాశాలకు రాని విద్యార్థుల తల్లితండ్రులతో అధ్యాపకులు మాట్లాడి అవగాహన కల్పిస్తున్నారు. హాజరు శాతం పెరిగితేనే ఫలితాలు పెరుగుతాయి. అలాగే విద్యార్థుల ప్రవేశాల సంఖ్య కూడా పెరగనున్నది. ఈ విధానంలో ఏమైనా సాంకేతిక అవరో ధాలు ఉంటే వాటిని అధిగమించి పకడ్బందీగా అమలు చేస్తాం.

Updated Date - Sep 20 , 2025 | 12:27 AM