Share News

అన్నారంలో అసంపూర్తిగా లో లెవల్‌ బ్రిడ్జి

ABN , Publish Date - Jun 08 , 2025 | 12:48 AM

మానకొండూర్‌-జమ్మికుంట రోడ్డు నిర్మాణాన్ని ఏడేళ్ల క్రితం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్ల రూపాయలతో ప్రారంభించింది. మానకొండూర్‌ గ్రామ పంచాయతీ నుంచి మార్కెట్‌, మసీదు మీదుగా తూర్పు దర్వాజ బస్టాండ్‌ నుంచి జమ్మికుంట వరకు కాంట్రాక్టర్‌ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాడు.

 అన్నారంలో అసంపూర్తిగా లో లెవల్‌ బ్రిడ్జి

మానకొండూర్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): మానకొండూర్‌-జమ్మికుంట రోడ్డు నిర్మాణాన్ని ఏడేళ్ల క్రితం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్ల రూపాయలతో ప్రారంభించింది. మానకొండూర్‌ గ్రామ పంచాయతీ నుంచి మార్కెట్‌, మసీదు మీదుగా తూర్పు దర్వాజ బస్టాండ్‌ నుంచి జమ్మికుంట వరకు కాంట్రాక్టర్‌ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాడు. మానకొండూర్‌, రాఘవాపూర్‌, అన్నారం, లలితాపూర్‌, దేవంపల్లి, రంగపేట, పోచంపల్లి, పచ్చునూర్‌ వరకు సబ్‌ కాంట్రాక్టర్‌ పనులను చేపట్టాడు. జమ్మికుంట నుంచి వీణవంక మండలంలోని మామిడాలపల్లి వరకు మరో సబ్‌ కాంట్రాక్టర్‌ పనులు చేపట్టారు. అప్పటి హుజురాబాద్‌ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిద్యం వహిస్తున్న వీణవంక మండలంలోని మామిడాలపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. పచ్చునూర్‌ నుంచి మానకొండూర్‌ వరకు ఆయా గ్రామాల ప్రజల ఆందోళనలతో అరకొర పనులు చేయడానికి సుమారు ఆరేళ్లు పట్టింది. అన్నారం నుంచి మానకొండూర్‌ వరకు తారు రోడ్డు లేక ఆరేళ్లు దుమ్ముతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు.

ఇష్టారాజ్యంగా పనులు

మానకొండూర్‌, అన్నారం గ్రామాల్లో రోడ్డు వెడెల్పు పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఈ రెండు గ్రామాలతో పాటు రాఘవాపూర్‌లో రోడ్డు నిర్మాణం చేపట్టాలని అనేక మార్లు ఆయా గ్రామాల ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను అడ్డుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ గ్రామాల్లో ఆదరబాదరగా తారు రోడ్డు నిర్మించారు. పూర్తిస్థాయిలో డ్రైనేజీలు నిర్మించకపోవడంతో మురికి నీరు ఎక్కడిక్కడే నిలిచిపోతోంది. లలితాపూర్‌, అన్నారం, మానకొండూర్‌ గ్రామాలలోని లో లెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టకపోవడంతోపాటు ఇరువైపులావంద మీటర్ల వరకు తారు రోడ్డు వేయలేదు. దీంతో ఆర్టీసీ బస్సులు, ఇసుక లారీలు వెల్లే సమయంలో దుమ్ము లేచి ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడడమే కాకుండా ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఏడేళ్లుగా వర్షాకాలంలో కురిసే వర్షాలతో ఎగువ భాగాన నుంచి వచ్చే వరద లో లెవల్‌ బ్రిడ్జిపై నుంచి ప్రహించడంతో రాకపోకలు నిలిచిన సంఘటనలు ఉన్నాయి. అన్నారంలో నెల రోజుల క్రితం లో లెవల్‌ బ్రిడ్జికి ఇరువైపులా పైపులు వేసి మధ్యలో వదిలిపెట్టారు. మానకొండూర్‌లో పూర్తిస్థాయిలో పైపులైన్‌ నిర్మాణ పనులు చేపట్టి తారు రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చొరువ తీసుకొని అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలతో ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Jun 08 , 2025 | 12:48 AM