Share News

ఎస్సారెస్పీ కాలువపై అక్రమ నిర్మాణాలు

ABN , Publish Date - Mar 18 , 2025 | 12:22 AM

మండలంలోని భీమరపల్లి శివారు సరిహద్దు ఎస్సారెస్పీ కాల్వపై అక్రమ నిర్మాణాలు వెలిసాయి. అయితే ప్రజలు ఆక్రమిస్తే గగ్గోలు చేసే అధికారులు ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించినా పట్టించుకోలేదు. పైగా వాటికి బిల్లులు కూడా చెల్లించారు. ఈ విషయమై అధికారులను అడిగితే విచారణ పేరుతో దాటవేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఎస్సారెస్పీ కాలువపై అక్రమ నిర్మాణాలు

ఓదెల, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని భీమరపల్లి శివారు సరిహద్దు ఎస్సారెస్పీ కాల్వపై అక్రమ నిర్మాణాలు వెలిసాయి. అయితే ప్రజలు ఆక్రమిస్తే గగ్గోలు చేసే అధికారులు ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించినా పట్టించుకోలేదు. పైగా వాటికి బిల్లులు కూడా చెల్లించారు. ఈ విషయమై అధికారులను అడిగితే విచారణ పేరుతో దాటవేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

మండలంలోని భీమరపల్లి సరిహద్దు కాల్వకట్టపై ఆరు సంవత్సరాల క్రితం ఓ ప్రజాప్రతినిధి, కార్యదర్శి కాల్వకట్టను ఆక్రమించి వైకుంఠధామాన్ని నిర్మించారు. పైగా దీనికి రూ. 12.50 లక్షల బిల్లులు చెల్లించారు. అలాగే ఎలాంటి ప్రొసీడింగ్‌ లేకుండా ఈజీఎస్‌ పనులు నిర్వహించి, నర్సరీలు కూడా పెంచుతున్నారు. ఓదెల నుంచి జీలకుంట వైపు ప్రధాన రహదారి ఇదే కావడం, వైకుంఠధామం, నర్సరీ ఏర్పాటుతో రహదారి ఇరుకుగా మారి పెద్ద వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ, ఎస్సారెస్పీ భూములను ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలంటే ముందుగా రెవెన్యూశాఖకు బదలాయించిన అనంతరం గ్రామపంచాయతీ కేటాయించాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఎస్సారెస్పీ కాల్వను ఆక్రమించి వైకుంఠధామం నిర్మించి ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధాన కాలువ, ఉపకాల్వ కట్టలను ఆక్రమించి ఆనవాళ్ళు లేకుండా పట్టా భూముల్లో కలుపుతున్నారు. డి86 ప్రధాన కాలువ ప్రారంభం నుంచి చివరి ఆయకట్టు కాల్వ శ్రీరాంపూర్‌ మండలం వరకు ఆక్రమణ పర్వం కొనసాగుతోంది. అధికారులు నామమాత్రంగా అక్రమార్కులకు అండగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో డి86 కాల్వ పక్కన ఉన్న ఎస్సారెస్పీ భూముల కొలతలు చేసి, భూములకు సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసిన అధికారులు, మళ్లీ అటువైప చూడడం లేదు. దీంతో ఆక్రమణ దారులకు అడ్డూఅదుపు లేకుండపోతోంది. ఏకంగా ఎక్స్‌కావేటర్‌, ట్రాక్టర్లతో కాల్వ కట్టలను చేరిపివేసి వరి, పత్తి పంటలకు అనుకూలంగా చదును చేసుకోవడంతో కాలువ విస్తీర్ణం తగ్గిపోయింది. స్వయంగా ఎస్సారెస్పీ అధికారులు పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆక్రమణలతో కాలువ బలహీన పడి నీటి విడుదల సమయంలో గండ్లు పడే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. గతంలో సాగునీటి సంఘాల పర్యవేక్షణ వల్ల కొంతవరకు ఎస్సారెస్పీ భూముల ఆక్రమణలు నిలిచిపోయాయి. సంఘాలను ప్రభుత్వం రద్దు చేయడంతో ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఒక్క అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులు సైతం ఆక్రమణలపై దృష్టి సారించి ఎస్సారెస్పీ భూములను, కాల్వ కట్టలను కాపాడాలని రైతాంగం, వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఫ ఎలాంటి అనుమతులు లేవు

- వెంకట శివరాజు , ఇరిగేషన్‌ ఎఈఈ , ఓదెల

భీమరపల్లి సరిహద్దు కాలువ కట్టపై నిర్మించిన వైకుంఠధామానికి ఇరిగేషన్‌ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కాల్వకట్టల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాం. వారు సూచించిన మేరకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - Mar 18 , 2025 | 12:22 AM