Share News

ఎదురుచూపులు ఎన్నాళ్లు...!

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:44 AM

రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు కొత్తగా అర్హులైన వారికి ప్రభుత్వం పెన్షన్‌ ఇవ్వడం లేదు. వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, హెచ్‌ఐవీ, తలసేమియా బాధితులు, బోధకాలు ఇలా పది నుంచి 12రకాలుగా పెన్షన్లు కొత్తవారికి అందకుండా పోతున్నాయి.

ఎదురుచూపులు ఎన్నాళ్లు...!

గోదావరిఖని, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు కొత్తగా అర్హులైన వారికి ప్రభుత్వం పెన్షన్‌ ఇవ్వడం లేదు. వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, హెచ్‌ఐవీ, తలసేమియా బాధితులు, బోధకాలు ఇలా పది నుంచి 12రకాలుగా పెన్షన్లు కొత్తవారికి అందకుండా పోతున్నాయి. వికలాంగులకు నెలకు రూ.4016, మిగిలిన అన్నీ క్యాటగిరిలకు రూ.2016ల చొప్పున ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. ఇందులో వృద్ధాప్య పెన్షన్లే 60శాతం ఉటాయి. 2020లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్ల వయోపరిమితిని 57ఏళ్లకే మార్చుతూ వృద్ధాప్య పెన్షన్లను ప్రకటించింది. దీంతో వృద్ధాప్య పెన్షన్‌కు అర్హులశాతం విపరీతంగా పెరిగింది. నెల రోజుల పాటు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదుచేశారు. అనంతరం పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు అటు ఆన్‌లైన్‌లో ఇటు ఆఫ్‌లైన్‌లో ఎన్ని వచ్చినప్పటికీ మంజూరు జరుగలేదు. దీంతో వేల మంది అర్హత కలిగిన ప్రజలు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మండలాల పరిధిలో ఎంపీడీవో, కార్పొరేషన్‌, మున్సిపల్‌ పరిధుల్లో ఆయా కార్యాలయాల్లో పెన్షన్ల దరఖాస్తులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. మీసేవల ద్వారా ఆన్‌లైన్‌లో కూడా వేల మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పెన్షన్లు పెంచుతామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ పెంచలేదు. పైగా 2020 నుంచి ఇప్పటి వరకు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించలేదు.

ఈ ఐదేళ్ల కాలంలో జిల్లాలో 30వేలకుపైగా రకరకాల పెన్షన్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోనే ఆఫ్‌లైన్‌లో 8వేల ఆసరా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో కూడా మరో ఐదారువేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో 90499మంది వివిధ రకాల పెన్షన్లు పొందుతున్నారు. ప్రతి నెల రూ.20,80,17,984 ఈ పెన్షన్‌ దారులకు అందుతున్నాయి. దీంతోపాటు ఈ మధ్య డయాలసిస్‌ పేషెంట్లకు, బోధకాలు వారికి అప్పుడో ఇప్పుడో కొత్త పెన్షన్లు మంజూరవుతున్నాయి. పెన్షన్‌ దారు చనిపోతే భాగస్వామికి నూతన పెన్షన్లు కూడా మంజూరవుతున్నాయి. కానీ ఐదేళ్లుగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న 30వేలకుపైబడిన నిరుపేదలైన వివిధ రకాల పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వేలాదిగా ఉన్న పెన్షన్‌ దరఖాస్తుదారుల నుంచి పార్టీలు, నాయకులు నిరసనను ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. నెల నెలా రూ.21కోట్లను పెన్షన్‌దారులు ఇస్తున్న ప్రభుత్వం నూతన పెన్షన్‌ దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో 1.3లక్షల నుంచి 1.4లక్షల మంది పెన్షన్‌దారులవుతారు. బడ్జెట్‌ కూడా మరో రూ.10కోట్లు పెరిగే అవకాశం ఉంది.

Updated Date - Aug 30 , 2025 | 12:44 AM