‘మెప్మా’లో ఇంటి దొంగలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:01 AM
పట్టణ మహిళా పేదరిక నిర్మూలనకు పాటు పడాల్సిన మెప్మా సిబ్బంది అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. అందిన కాడికి మేస్తున్నారు. వారి అక్రమాలకు రాజకీయ పలుకుబడి కూడా అనుకూలించడంతో వారి అవినీతికి అడ్డూ అదుపులేకుండా పోయింది.
జగిత్యాల, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పట్టణ మహిళా పేదరిక నిర్మూలనకు పాటు పడాల్సిన మెప్మా సిబ్బంది అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. అందిన కాడికి మేస్తున్నారు. వారి అక్రమాలకు రాజకీయ పలుకుబడి కూడా అనుకూలించడంతో వారి అవినీతికి అడ్డూ అదుపులేకుండా పోయింది. జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు రుణాల్లో కొంతమంది ఆర్పీలు తమ అవినీతిని బయటపడకుండా బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్నారు. అదీ ఏకంగా మూడు, నాలుగేళ్లుగా కొనసాగుతోంది.
రిసోర్స్ పర్సన్లే కీలకం...
జిల్లాలోని మున్సిపాలిటీల్లో గల మెప్మా విభాగాల్లో మహిళా సంఘాల కార్యకలాపాల నిర్వహణకు రిసోర్స్ పర్సన్‌లే కీలకంగా వ్యవహరిస్తుంటారు. వార్డుకు ఒక ఆర్‌పీ చొప్పున, పట్టణ సమాఖ్యకు ఒక ఆర్‌పీ, టీఎంసీలు, ఏడీఎంసీలు, డీఎంసీలు వివిధ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందజేయడం, స్త్రీ నిధి రుణాల పంపిణీ, బ్యాంకు కిస్తీల చెల్లింపు, రుణాల రికవరీ తదితర వ్యవహారాల్లో ఆర్‌పీలు బాధ్యత కీలకంగా ఉంటుంది. సంఘాల సభ్యులు రుణాలు పొందాలన్న, తీర్మానాలు చేసుకోవాలన్నా ఆర్‌పీలు రిపోర్టులు తయారు చేస్తుంటారు.
నకిలీ సంఘాలను సృష్టించి రుణాలు..
జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, రాయికల్ తదితర మున్సిపాలిటీల్లో పలువురు రిసోర్స్‌పర్సన్లు నకిలీ సంఘాలను సృష్టించి బ్యాంకు లింకేజీ రుణాలు పొంది సొంతానికి వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా జగిత్యాల, మెట్‌పల్లిలో ఓ బ్యాంకులో నకిలీ సంఘాలు, నకిలీ సభ్యులతో ఖాతాలు తెరిచి రుణాలు పొందిన సంఘటనలు గతంలో వెలుగు చూశాయి. నకిలీ సర్టిఫికేట్లతో గ్రూపులు సృష్టించి రుణాలు పొందినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకోవాలంటే ఆర్‌పీలు సమావేశం ఏర్పాటు చేసి ఒక ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత వాటిని కమ్యూనిటీ ఆర్గనైజర్ (సీవో) పరిశీలించి సంతకం పెట్టాలి. అనంతరం టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ (టీఎంసీ) పరిశీలిస్తారు. రుణానికి సంబంధించిన ఫైల్ బ్యాంకుకు వెళ్లిన తర్వాత అక్కడ అధికారులు పరిశీలిస్తారు. మైక్రో క్రెడిట్ ప్లాన్ (ఎంసీపీ) అనే వెబ్‌సైట్‌లో సభ్యుల పేర్లు ఉంటేనే అది నిజమైన గ్రూపు అని తెలుస్తోంది. కానీ బ్యాంకు అధికారులను బురిడీ కొట్టిస్తూ ఎంసీపీ ఆన్‌లైన్‌లో ఉన్న సంఘ సభ్యుల పేర్లు కాకుండా మ్యానువల్ పేపర్లలో ఇతర ఫేక్ సభ్యుల పేర్లు జతపరిచి నకిలీ పత్రాలు సమర్పించి లోన్లు పొందుతున్నట్లు తెలుస్తోంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, లోన్లు మంజూరు సమయంలో ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో సమర్పించిన పత్రాలను సరిపోల్చుకొని రుణాలు మంజూరు చేయాల్సిన అధికారులు కేవలం మ్యానువల్ ఆధారంగానే పరిశీలన జరుపుతుండడం తో అక్రమాలు జరుగుతున్నట్లు అధికారుల విచారణలో గుర్తించారు.
ఫ రికవరీ జాడేది...?
జిల్లాలో దుర్వినియోగం అయిన నకిలీ మహిళా సంఘాలు, సభ్యులకు చెందిన రుణాల రికవరీపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్ తదితర మున్సిపాలిటీల్లో అవకతవకలు బయటపడినా ఇప్పటివరకు అరకొరగా మినహా రికవరీ జరగడం లేదు. ఇటీవల ఉన్నతాధికారులు జరిపిన సమీక్షలో రుణాలు చెల్లించడంలో జాప్యం చోటుచేసుకుంటుందని ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. అయినా రికవరీపై అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కాగా రికవరీ సందర్భంగా బ్యాంకు అధికారులు, మెప్మా అధికారులు ప్రయత్నిస్తే అక్రమార్కులు బెదిరించడం, అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్ పేరుతో కాజేసిన సొమ్ములో ఆర్‌పీలు ఎంతో కొంత చెల్లించి కేసులు, ఆరోపణల నుంచి బయటపడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఒకరిద్దరు ఆర్‌పీలకు అలవాటుగా మారినట్లుగా మెప్మావర్గాలు అంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు పకడ్భందీగా వ్యవహరించి రికవరీపై దృష్టి సారించాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
జిల్లాలో కొన్ని సంఘటనలు..
కోరుట్లలో 2023 జనవరి నెలలో ఓ ఆర్‌పీ అధికారుల సహాయంతో బ్యాంకు లింకేజీ రుణం 10 లక్షల రూపాయలను దుర్వినియోగానికి పాల్పడినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది.
మెట్‌పల్లిలో 2023 జనవరి నెలలో ఓ ఆర్‌పీ రూ. 10 లక్షల రుణాన్ని అక్రమంగా పొంది సొంతానికి వాడుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఏప్రిల్‌లో ఓ ఆర్‌పీ మహిళా సంఘాల సభ్యులు చెల్లించిన నాలుగు లక్షల రూపాయలను సొంతానికి వినియోగించుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది.
కోరుట్లలో 2023 ఫిబ్రవరి నెలలో ఓ ఆర్‌పీ 16 స్వయం సహాయక సంఘాలకు రూ. 1.85 కోట్లు రుణాలు ఇప్పించగా అందులో రూ. 72 లక్షల రుణాలను నకిలీ సంఘాలతో బ్యాంకులను బురిడీ కొట్టించి పొందినట్లుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది.
జగిత్యాలలో 2022 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు పలు బ్యాంకుల్లో ఓ రిసోర్స్ పర్సన్ సుమారు 57 మహిళా సంఘాల్లో కొందరు నకిలీ సభ్యులను చేర్చి రుణాలు పొందినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. సుమారు మూడు లక్షల 50వేల వరకు రుణాలు తప్పుదారి పట్టినట్లుగా గుర్తించారు. ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో నకిలీ సంఘాలతో రుణాలు పొందినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఇందులో ఒకరిద్దరు మెప్మా ఆర్‌పీలు కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.