Share News

సాదా బైనామాలపై ఆశలు

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:03 AM

సాధారణ పేపర్లపై రాసుకొని భూములు కొనుగోలు చేసిన వారికి హక్కులు లభించనున్నాయి. భూ భారతి చట్టం ద్వారా క్రమబద్ధీకరించేందుకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆయా భూములపై హక్కులు దక్కనున్నాయి.

సాదా బైనామాలపై ఆశలు

జగిత్యాల, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సాధారణ పేపర్లపై రాసుకొని భూములు కొనుగోలు చేసిన వారికి హక్కులు లభించనున్నాయి. భూ భారతి చట్టం ద్వారా క్రమబద్ధీకరించేందుకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆయా భూములపై హక్కులు దక్కనున్నాయి. అయితే కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వచ్చాక ఈ యేడాదిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సాదాబైనామా దరఖాస్తుదారుల్లో కొందరికి హక్కులు దక్కేలా లేవు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్నా 2020లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఆయా భూములపై హక్కులను కల్పిస్తూ 13-బీ సర్టిఫికెట్లను జారీ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

సాకారం కానున్న ఏళ్ల నిరీక్షణ..

సాదా బైనామాలతో కొనుక్కున్న భూములపై హక్కుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు ఎట్టకేలకు పరిష్కారం లభించనుంది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో వారందరికీ హక్కులు దక్కబోతున్నాయి. ఇన్నాళ్లూ భూములు తమ ఆధీనంలోనే ఉన్నా, వ్యవసాయం చేస్తున్నా హక్కులు మాత్రం లేకుండా పోయాయి. రైతు బంధు, రైతు భరోసా వంటి పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడం, పంట రుణాలు తీసుకునే అవకాశం లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాదాబైనామాలను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ధరణిలో వాటి పరిష్కారానికి అవకాశం ఇవ్వకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. భూభారతి అమలులో భాగంగా వాటి క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేయడంతో జగిత్యాలలో వేల సంఖ్యలో దరఖాస్తులకు ఆయా భూములపై త్వరలోనే హక్కులు దక్కనున్నాయి.

రెవెన్యూ సదస్సుల్లో 8,718 దరఖాస్తులు

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక భూభారతిని అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఈ యేడాది జూన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించింది. జూన్‌ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోను సదస్సులను నిర్వహించి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో జిల్లాలో 37,931 మంది వివిధ భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు. అందులో సాదాబైనామాలకు సంబంధించి 8,718 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రస్తుత సాదాబైనామాల క్రమబద్ధీకరణలో ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడం కుదరదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టంగా దరఖాస్తుల కటాఫ్‌ తేదీని ప్రకటించినందున ఈ దరఖాస్తులకు హక్కులు దక్కవని అంటున్నారు. అయితే ఈ దరఖాస్తులు 2020 నాటి కటాఫ్‌ తేదీల్లో దరఖాస్తు చేసుకొని ఉంటే హక్కులు దక్కనున్నాయి.

జిల్లాలో దరఖాస్తుల వివరాలు..

జిల్లాలో మొత్తం సాదాబైనామా దరఖాస్తుల సంఖ్య...44,910

2020 సంవత్సరంలో మీ సేవలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య...37,730

ఇందులో తిరస్కరించిన దరఖాస్తులు...12,594

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు...8,718

జిల్లాలో విచారణ పూర్తయిన సాదాబైనామాల సంఖ్య...2,976

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే...

-బీఎస్‌ లత, అదనపు కలెక్టర్‌

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకే జిల్లాలో సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించనున్నాం. ప్రతీ దరఖాస్తును క్షుణంగా పరిశీలించి తగిన నిర్ణయాన్ని వివిధ స్థాయిలో రెవెన్యూ అధికారులు తీసుకుంటారు. గతంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి విచారణ జరిపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Sep 16 , 2025 | 01:03 AM