Share News

హిడ్మా ఎన్‌కౌంటర్‌ బూటకం

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:36 PM

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆదివాసీ నాయకుడు మడివి హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులను ఈ నెల 18న మారెడ్‌మిల్లిలో బూటకపు ఎన్‌కౌంటర్‌ పేరుతో హతమార్చారని పలు ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు.

హిడ్మా ఎన్‌కౌంటర్‌ బూటకం

పెద్దపల్లి కల్చరల్‌, నవంబరు23(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆదివాసీ నాయకుడు మడివి హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులను ఈ నెల 18న మారెడ్‌మిల్లిలో బూటకపు ఎన్‌కౌంటర్‌ పేరుతో హతమార్చారని పలు ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఆదివారం అమరవీరుల స్థూపం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి మాట్లాడుతూ ఈ నెల 15న హిడ్మాతోపాటు పలువురిని పట్టుకుని కాల్చిచంపారన్నారు.

ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఆదివాసీలపై హత్యాకాండను కేంద్ర ప్రభుత్వం సాగిస్తోందన్నారు. మావోయిస్టు పార్టీ సాయుధ మార్గాన్ని ఎంచుకుంటే, ప్రభుత్వం చేస్తున్నది హత్యలు కాదా అని ప్రశ్నించారు. కార్పొరేట్‌ సంస్థల కోసమే గిరిజనులపై దమనకాండ సాగిస్తున్నదన్నారు. పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి రవి, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి కొమురయ్య, రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముడిమడుగుల మల్లన్న, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రత్నకుమార్‌, పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు నారా వినోద్‌, యాదనవేణి పర్వతాలు, బండి శంకర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 11:37 PM