కౌలు రైతులను ఆదుకోరూ...!
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:44 AM
కౌలు రైతులను ఆదుకునేందుకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతుభరోసా పథకం ద్వారా పెట్టబడి సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారి గురించి పట్టించుకోవడం లేదు. ఏడాదిన్నర గడిచినా కూడా వారి ఊసెత్తడం లేదు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
కౌలు రైతులను ఆదుకునేందుకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతుభరోసా పథకం ద్వారా పెట్టబడి సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారి గురించి పట్టించుకోవడం లేదు. ఏడాదిన్నర గడిచినా కూడా వారి ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వం వ్యవహరించి నట్లుగానే ప్రస్తుతం ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయమే జీవనాధా రంగా జీవించే కొందరు రైతులు తమకున్న భూమితోపాటు మరికొందరి పట్టాదారుల భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. ఎలాంటి భూములు లేని కొందరు రైతులు కూడా భూములను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి చెమటోడ్చి పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకు కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే అంతే సంగ తులు. కష్టమంతా పట్టాదారుల చేతిలో పెట్టాల్సిందే. యేటా పెరుగుతున్న పంట పెట్టుబడులు, కౌలు ధర లతో కౌలు రైతులు కుదేలవుతున్నారు. పంట రుణాలకు, రైతు బీమాకు, పంటల బీమాకు, సబ్సిడీ పథకాలకు కౌలు రైతులు నోచుకోవడం లేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినా కూడా పరిహారం ప్రభుత్వం పట్టాదారులకే ఇస్తున్నది. ప్రభుత్వ సాయం అందక పంట నష్టాలు వచ్చి పెట్టిన పెట్టుబడులు దక్కక అనేక మంది రైతులు అప్పుల పాలవుతున్నారు. ఆ అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయాలపై అధ్యయనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫ రైతుభరోసా ఇస్తామని ప్రభుత్వ హామీ..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను తీసుకు వచ్చింది. తమను గెలిపిస్తే ఆ పథకాలను అమలు చేస్తామని విస్తృతంగా ప్రచారం చేసింది. అందులో భాగంగా రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా పథకం కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తామని, రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. మొదట 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం గడిచిన యాసంగి సీజన్ నుంచి రైతుభరోసా పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఒక్కో పంటకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున గాకుండా 6 వేలు ఇచ్చారు. అది కూడా 3 ఎకరాల వరకు మాత్రమే భూములు కలిగిన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. ఈ వానాకాలం సీజన్‌లో పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. సోమవారం సాయంత్రం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. కానీ ప్రభుత్వం కౌలు రైతుల ప్రస్తావన తీయడం లేదు. సన్న ధాన్యం పండించే రైతులకు గత వానాకాలం సీజన్ నుంచి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నది. దీంతో సన్న ధాన్యం పండించిన కౌలు రైతులకు బోనస్ రూపంలో కొంత మేలు జరిగినప్పటికీ, పట్టాదారులు కొందరు ఆ బోనస్‌లో తమకు సగం కోరుతుండగా, ఇంకొందరు కౌలు ధరలను పెంచారని రైతులు చెబుతున్నారు. రెండు పంటలు పండే వరి పొలాలకు ఎకరానికి ఒక్కో పంటకు 10 నుంచి 12 వేలు తీసుకుంటున్నారని, వర్షాధారంగా సాగయ్యే పత్తి పంటకు ఏడాదికి ఎకరానికి 12 వేల నుంచి 18 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. యాసంగి సీజన్ బోనస్ డబ్బులు విడుదల కాలేదు. కౌలు రైతులను గుర్తించేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలను రూపొందించ లేదు. దీంతో ప్రభుత్వం తమకు పెట్టుబడి సాయాన్ని అందిస్తుందా, లేదా అని కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. బోనస్‌తో సంబంధం లేకుండా పట్టాదారులకు ఇచ్చినట్లుగానే తమకు కూడా రైతుభరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందించాలని కౌలు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.