Share News

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్టు లేక అవ స్థలు

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:05 AM

మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు అందక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. యాభై పడకల ఆసుపత్రిలో గర్భిణులు, నవజాత శిశువులు లేకపోవడంతో బోసిపోతోంది. మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌, మల్హర్‌, కాటారం మండలాలతోపాటు ఇతర మండలాల్లోని మారుమూల గ్రామాలకు మంథని మాతా శిశు ఆరోగ్యకేంద్రం అందుబాటులో ఉంటుంది. ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్టు లేక అవ స్థలు

మంథని, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు అందక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. యాభై పడకల ఆసుపత్రిలో గర్భిణులు, నవజాత శిశువులు లేకపోవడంతో బోసిపోతోంది. మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌, మల్హర్‌, కాటారం మండలాలతోపాటు ఇతర మండలాల్లోని మారుమూల గ్రామాలకు మంథని మాతా శిశు ఆరోగ్యకేంద్రం అందుబాటులో ఉంటుంది. ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రెండు నెలలుగా గైనకాలజిస్టు వైద్యురాలు లేని కారణంగా వైద్య సేవలు అందని ద్రాక్షగా మారింది. ఇక్కడ పని చేసిన గైనకాలజిస్టు డాక్టర్‌ స్రవంతి ఇటీవల బదిలీపై వెళ్లడంతో ఆసుపత్రిలో సేవలు నిలిచిపోయాయి. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన గర్భిణీలు, బాలింతులు, నవజాత శిశువులకు ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు, మందులు అందడం లేదు. గోదావరిఖని, పెద్దపల్లి మాతా శిశు ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా వారికి శారీరక, మానసిక అవస్థలతో పాటు సమయాభావం, ప్రయాణంలో అలసటతో ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు వారి కుటుంబ సభ్యులు సైతం వారిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి అంగీకరించడం లేదు. ఈ ఆసుపత్రిలో గైనిక్‌ సేవలు అందుబాటులో ఉన్న సమయంలో నెలకు 50కి పైగా ప్రసవాలు జరిగినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం గర్భిణీలకు మందులు పంపిణీ చేస్తున్నారు.

అత్యవసరంగా ప్రసూతికి వచ్చే గర్భిణి కుటుంబ సభ్యులకు ఇక్కడి పరిస్థితిని వివరిస్తున్నారు. వారి అనుమతితో మిడ్‌ వైఫరీలు, స్టాఫ్‌ నర్సులు డెలివరీ చేస్తున్నారు. పది రోజుల్లో రెండు డెలివరీలు చేశారు. అత్యవసరంగా తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడానికి ఇలా సేవలందిస్తున్నారు. ఇలాంటి సమయంలో వారిని గోదావరిఖని, పెద్దపల్లి ప్రాంతాలకు తరలించడానికి అవకాశం ఉండటం లేదు. అందుకే వారు సాహసోపేతంగా డెలివరీలు చేస్తున్నారు. అలా తరలించే సమయాల్లో ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడితే తల్లీ, శిశువులకు ప్రాణాపాయం చోటుచేసుకునే ప్రమాదం ఉంది. నియోజకవర్గ కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో గైనకాలజిస్టును నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని మంథని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్టు సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వారంలోగా రోస్టర్‌ పద్ధతిలో నియమిస్తాం

డాక్టర్‌ కే. శ్రీధర్‌, డీసీహెచ్‌ఎస్‌, పెద్దపల్లి.

మంథని ఎంసీహెచ్‌లో గైనకాలజిస్టును నియమించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంసీహెచ్‌లో రెగ్యూలర్‌ గైనకాలజిస్టును నియమించడానికి ఇప్పటికే 4సార్లు ప్రకటన ఇచ్చినా స్పందన రాలేదు. జిల్లాలో ఐదుగురు గైనకాలజిస్టులు పని చేస్తుండగా వారిలో ఇద్దరు లీవ్‌లో ఉన్నారు. వారు విధుల్లోకి రాగానే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశాల మేరకు రోస్టర్‌ పద్ధతిలో ఎంసీహెచ్‌లో విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకొంటాం. ఓపీ, సర్జరీలు చేసే విధంగా చర్యలు తీసుకోవటానికి కృషి చేస్తున్నాం.

Updated Date - Mar 05 , 2025 | 12:05 AM