అకాలవర్షంతో తడిసిన ధాన్యం
ABN , Publish Date - May 02 , 2025 | 11:30 PM
అకాల వర్షంతో మంథని మున్సిపాటిటీ పరి ధి, మండలంలోని వివిధ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసిపోయింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో గురువారం అర్థరాత్రి తర్వాత భారీ గాలి వానతోపాటు భారీగా వర్షం కురిసింది.
మంథని/మంథనిరూరల్ మే 2 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షంతో మంథని మున్సిపాటిటీ పరి ధి, మండలంలోని వివిధ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసిపోయింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో గురువారం అర్థరాత్రి తర్వాత భారీ గాలి వానతోపాటు భారీగా వర్షం కురిసింది. దీంతో సింగిల్‌విండో ద్వారా 35 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ద్వారా 3 కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. మంథని మార్కెట్ యార్డులో భారీగా ధాన్యం తడిసింది.
శుక్రవారం ఉదయం వరి కుప్పల మధ్య నిల్వ ఉన్న నీటిని తొలగించేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి ఇబ్బందులు పడ్డారు. ధాన్యం కుప్పలపై పాలిథిన్ కవర్లు, టార్ఫాలిన్లు కప్పినప్పటికీ బలంగా వీచిన గాలి దుమారంతో కొట్టుకుపోయాయి. మండలంలోని ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వరి కోతలు కాని పొలాల్లో పంటలు నేలవాలడం, గింజలు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల వలన ఆరెంద, గోపాల్‌పూర్, ఎక్లాస్‌పూర్, నాగెపల్లి, అడవిసోమన్‌పల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఆరబెట్టడానికి ఇబ్బందులు పడ్డారు.