రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - May 17 , 2025 | 12:03 AM
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేస్తున్నామని, గతంలో కంటే ఈ సీజన్‌లో అత్యధిక ధాన్యాన్ని కొనుగోలు చేశామని, సన్నరకం ధాన్యానికి ఒకటి, రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కానున్నాయని అదనపు కలెక్టర్ డి వేణు అన్నారు.
పెద్దపల్లి, మే 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేస్తున్నామని, గతంలో కంటే ఈ సీజన్‌లో అత్యధిక ధాన్యాన్ని కొనుగోలు చేశామని, సన్నరకం ధాన్యానికి ఒకటి, రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కానున్నాయని అదనపు కలెక్టర్ డి వేణు అన్నారు. శుక్రవారం ఆయన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ సీజన్‌లో 329 కొనుగోలు కేంద్రాలకుగాను 319 కేం ద్రాలను ప్రారంభించామన్నారు. 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా కాగా, కేంద్రాలకు 3.54 లక్షల టన్నుల ధాన్యం రావచ్చని వ్యవసాయ శాఖాధికారులు పేర్కొన్నారని తెలిపారు. ఇప్పటి వరకు 2,56,810 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇందులో దొడ్డు రకం 2,28,692 టన్నులు, సన్నరకం 28,112 టన్నులు ఉందన్నారు. 592.78 కోట్లకుగాను 512 కోట్ల రూపాయలు 84 శాతం చెల్లింపులు చేశామన్నారు. కేంద్రాలకు 60 నుంచి 70 వేల టన్నుల ధాన్యం రావచ్చని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పెద్ద పల్లి, సుల్తానాబాద్, ధర్మారం మార్కెట్ యార్డుల్లో తడిసిన 3842 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. సన్న రకం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగ డం లేదని, ఆ రకం వరి కోతలు ఆలస్య మవుతున్నాయన్నారు. నిమ్మనపల్లి కేం ద్రంలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం కావడం లేదన్నారు. ఒక రైతుకు చెందిన ధాన్యంలో 17 శాతం తేమ రాలేదని కాంటా వేయలేదని, మరుసటి రోజు కాం టా వేస్తామని నిర్వాహకులు తెలిపారని, అయినా కొందరు రైతులు ధర్నా చేశార న్నారు.
జిల్లాలో 135 రైస్‌మిల్లులకు ధాన్యాన్ని కేటాయించామని, 48 మిల్లుల నుంచి బ్యాంకు గ్యారంటీలు వచ్చాయని, మిగతా మిల్లులవి కూడా వస్తున్నాయన్నారు. రెండు సీజన్ల కంటే ఈ సీజన్‌లోనే ధాన్యా న్ని ఎక్కువగా కొనుగోలు చేశామ న్నారు. 2022-23 యాసంగిలో 1,13,703 టన్నుల ధాన్యం, 2023-24లో 2,32,281 టన్నులు, ఈ సీజన్‌లో 2,56,810 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతులు ఆం దోళన చెందవద్దని మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ వేణు చెప్పారు. ఈ సమావేశంలో డీఎస్‌వో రాజేందర్, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.