తేమ శాతాన్ని తగ్గించే గ్రెయిన్ డ్రైయ్యర్ మిషన్లు
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:39 AM
ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని దిగుబడి సాధించిన రైతులకు దానిని విక్రయించడం సవాల్‌గా మారుతోంది. ముఖ్యంగా తేమ శాతం ఆందోళనకు గురిచేస్తోంది. నిబంధనల మేరకు ధాన్యంలో తేమ శాతం లేకపోతే కొనుగోలు చేయరు, చేసిన మద్దతు ధర లభించదు. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. తేమ కష్టాలు తొలగించేందుకు గ్రెయిన్ డ్రైయ్యర్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.
మంథని, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టించి పండించిన ఉత్పత్తులను మార్కెట్‌లో సకా లంలో అమ్ముకోవటానికి, నిల్వ చేసుకునేందుకు, నాణ్య తను పెంచుకోవటానికి ఇక నుంచి రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. గ్రెయిన్ డ్రైయ్యర్ మిషన్లు రైతుల నేస్తాలా పని చేస్తున్నాయి. ఒక్కొక్కటి రూ. 14 లక్షల విలువ చేసే ఈ మిషన్లను జిల్లాలోని మంథని-2, పెద్దపల్లి-1, సుల్తానాబాద్-1, ధర్మారం-1 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఇటీవల సివిల్ సప్లై, మార్కెటింగ్ శాఖల ద్వారా ఏర్పాటు చేశారు. మంథనిలో 2 మిష న్లను అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవ చూపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన గ్రెయిన్ డ్రైయ్యర్ మిషన్లు పంటలను ఆరబెట్టు కోవటానికి, అమ్ముకోవటానికి, నిల్వ చేసుకోవటానికి రోజుల తరబడి ప్రక్రియను ఈ విషన్లు కేవలం కొన్ని గంటల సమయంలో ఈ ప్రాసెసింగ్‌ను పూర్తి చేస్తు న్నాయి. దీంతో వరి, మొక్కజొన్న పంటలు పండించే రైతులకు సమయం, శ్రమ, అదనపు డబ్బుల ఖర్చు, రోజుల తరబడి వేచి ఉండడం నుంచి విముక్తి కలగనుంది. రైతులు తమ పంటల ఉత్పత్తులను సకాలంలో అమ్ముకోవటానికి, నాణ్యత ప్రమాణాలను మెరుగు పర్చుకోవటానికి ఈ మిషన్లు తోడుపడుతు న్నాయి. మార్కెట్ యార్డుల్లో, రోడ్ల మీద, పొలాల్లో రోజుల తరబడి ధాన్యాన్ని అరబెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కవ తేమతో కూడిన వాతావరణంలో సైతం ధ్యాన్యాన్ని త్వరితగతిన ప్రాసెసింగ్ చేయటానికి వీటిని వినియోగిస్తున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే పదుల క్వింటాళ్ళ ధాన్యంలో 30 శాతం తేమ ఉన్న వాటిని నిబంధనల మేరకు కొనుగోలు చేసే 17 శాతం వచ్చేలా గ్రెయిన్ డ్రైయ్యర్ మిషన్లు ఉపయోగపడుతున్నాయి. గంటకు సుమారు 25 క్వింటాళ్ళ పైగా ధాన్యాన్ని ఈమిషన్ల ద్వారా ఆరబెట్టి తేమ ఎంత శాతం ఉన్న దాన్ని 17 శాతానికి వచ్చేలా ప్రక్రియను కొనసాగించి అమ్ముకునే విధంగా రైతులు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రెయిన్ డ్రైయ్యర్ మిషన్లతో ఉపయోగాలు..
వరి, మొక్కజొన్న, గోధుమ పంటల ఉత్పత్తుల్లో అధిక తేమ వల్ల వచ్చే బూజు, ఇతర సూక్ష్మ జీవుల పెరుగుదలను నివారిస్తుంది. తేమ శాతం ఎంత ఉన్న దాన్ని 12-15 శాతానికి తగ్గిస్తుంది. ధాన్యాల నాణ్యత, షెల్ఫ్‌లైఫ్‌ను మెరుగుపరుస్తుంది. రైతులు తమ పంట లను నిల్వ చేసుకోవటానికి, వాటి విలువను కాపాడుకోవటానికి సహాయపడుతాయి.
డ్రైయ్యర్ మిషనుల ఇలా పని చేస్తాయి..
హాట్ ఎయిర్ (వేడి గాలి) ప్రవాహంతో ఫ్యాన్లు, బర్నర్ల సహాయంతో వేడి గాలిని యంత్రం లోపలి భాగంలోకి పంపిస్తారు. ఈ వేడి గాలి ధాన్యంలోని తేమను తొలగిస్తుంది. కొన్ని యంత్రాలు ఆటోమెటిక్‌గా పని చేస్తాయి. వాటిల్లో ధాన్యాన్ని పంపినప్పుడు వేడి గాలి విడుదలై తేమ శాతాన్ని తగ్గించి, నిర్దిష్ట సమయంలో ధాన్యాన్ని బయటకు పంపిస్తాయి. ఇవీ కరెంట్, డీజిల్, పెట్రోల్‌తో పని చేస్తాయి.
రైతులే డీజిల్, పెట్రోల్ ఖర్చు భరించాలి
మంథని మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేసిన ఈవిషన్ల వినియోగానికి కరెంట్ లోడ్ సరిపోకపోతే రైతులు సొంత ఖర్చులతో డీజిల్, పెట్రోల్ ఖర్చు భరించి ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసుకుంటున్నారు. దీంతో రైతులకు వాటికి, ట్రాక్టర్ వినియోగానికి దాదాపు 3 వేల వరకు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. కొంత మంది రైతులు ఖర్చు భరించి ధాన్యం అమ్ముకోగా చాలా మంది రైతులు అదనపు ఖర్చు భయంతో ముందుకు రావడం లేదు. మిషన్ల వినియోగానికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయించారని, త్వరలోనే అమర్చి విషన్ల రైతులకు సేవలందిస్తామని మంథని ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న తెలిపారు.