ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవాలు జరపాలి
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:33 AM
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దాసరి వేణు, డీసీపీ కరుణాకర్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్నారు.
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబర్1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దాసరి వేణు, డీసీపీ కరుణాకర్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్నారు. నిమజ్జనానికి మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల వారిగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జనం పాయింట్ల వద్ద ఏర్పాట్లతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణ పాటిస్తూ అధికారులకు నిర్వాహకులు, భక్తులు సహకరించాలని కోరారు. నిమజ్జన సమయంలో మద్య నిషేధం కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, అలాగే మూడు షిప్టుల్లో పారిశుధ్య సిబ్బంది పరిసరాల పరిశుభ్రత చేపట్టాలన్నారు. ఆయా చెరువుల వద్ద గజ ఈతగాళ్లు, క్రేన్‌లను సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ నిమజ్జనం ఊరేగింపు చివరి పూజ సూర్యాస్తమం కంటే ముందే ప్రారంభించాలన్నారు. జిల్లాలో 2500 విగ్రహాలు, మంచిర్యాల నుంచి మరో 2 వేల విగ్రహాల వరకు గోదావరి బ్రిడ్జి వద్దకు వస్తాయని అంచనా ఉన్నట్లు తెలిపారు. మున్సిపల్, పోలీస్ ఉత్సవ సభ్యులు సమన్వయంతో నిమజ్జనం పూర్తి చేయాలన్నారు. ఆర్డీఓలు గంగయ్య, సురేష్, ఏసీపీలు, అధికారులు పాల్గొన్నారు.