గంగమ్మ ఒడికి గణపయ్య...
ABN , Publish Date - Sep 07 , 2025 | 01:24 AM
జై బోలో గణేష్ మహారాజ్‌కీ జై ...గణపయ్యా.. వెళ్లి రావయ్యా అంటూ భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు చేసిన భక్తులు వినాయక నిమజ్జన వేడుకలను రెండో రోజు శనివారం ఘనంగా జరుపుకున్నారు.
జగిత్యాల క్రైం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) :జై బోలో గణేష్ మహారాజ్‌కీ జై ...గణపయ్యా.. వెళ్లి రావయ్యా అంటూ భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు చేసిన భక్తులు వినాయక నిమజ్జన వేడుకలను రెండో రోజు శనివారం ఘనంగా జరుపుకున్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి పట్టణాలతో పాటు మెట్‌పల్లి, కోరుట్ల, మల్యాల, రాయికల్, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో నిమజ్జనం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఉదయం నుంచే గణపతుల శోభాయాత్ర ప్రారంభం కాగా టవర్, చింతకుంట చెరువు ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడాయి. కలెక్టర్ సత్యప్రసాద్‌తో పాటు ఎస్పీ అశోక్ కుమార్‌లు చింతకుంట చెరువు వద్ద నిమజ్జన వేడుకలను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలోని సుమారు 500 పైగా విగ్రహాలు నిమజ్జనానికి తరలిరాగా తెల్లవారుజాము వరకు నిమజ్జన వేడుకలు కొనసాగాయి. అవాంఛనీయ సంఘటనలు జరుగకుంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో పలు వినాయక మండపాలతో పాటు టవర్ వద్ద మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, జడ్పీ, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్లు దావ వసంత, అడువాల జ్యోతితో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గోదావరి వద్ద భక్త జన సందడి
ఫధర్మపురి: ధర్మపురి క్షేత్రంలో వినాయక నిమజ్జనం వేడుకలు శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ధర్మపురి, రాయపట్నం వద్ద అతి పెద్ద వినాయక విగ్రహాలను క్రేన్ సహాయంతో నదిలో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఐలు ఉదయ్‌కుమార్, రవీంద్రకుమార్ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సంగి సత్యమ్మ, మున్సిపల్ కమిషనర్ మామిళ్ల శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ ఏరుకొండ శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్, టీపీసీసీ సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగనభట్ల దినేష్, ఏఎంసీ చైర్‌పర్సన్ చిలుముల లక్ష్మణ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ సంగి సత్యమ్మ, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు కస్తూరి రాజన్న, వెలగందుల బుచ్చన్న, అల్లం దుర్గప్రసాద్, ఎలగందుల రవి, రంగు లక్ష్మినరహరి, గడిపెల్లి రాజమల్లయ్య పాల్గొన్నారు. ధర్మపురి నంది విగ్రహ చౌరస్తా వద్ద భక్తుల సౌకర్యార్థం దారుల్‌ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూల్ వాటర్ పంపిణీ కేంద్రాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ ముస్లీం కమిటీ అధ్యక్షులు జైనొద్దీన్, నేతలు పాల్గొన్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో వినాయక నిమజ్జనం వేడుకలు నిర్వహించారు.
గణనాథుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి
-మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి: గణనాథుని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ఆకాంక్షించారు. వినాయక నిమజ్జనం సంద ర్భంగా స్థానిక నంది చౌక్ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి మంత్రి మాట్లాడారు. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వినాయక మండప నిర్వాహకులు, యువకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కోరుట్ల పట్టణంలో..
ఫకోరుట్ల: కోరుట్ల పట్టణంలో వైభవంగా వినాయక నిమజ్జనం నిర్వహించారు. పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభమైన వినాయక నిమజ్జన ర్యాలీని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కోరుట్ల ఆర్‌డీఓ జీవకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, మున్సిపల్ కమిషనర్ రవీందర్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుమతి పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మొదటి బహుమతి యువతరం యూత్, రెండవ బహుమతి చిరుత, మూడవ, నాలువ స్థానాలలో భారతి సంఘం, ఇండియాన్ యూత్ బహుమతులు దక్కాయి. శోభయాత్ర ఐబీ రోడ్డు నుంచి నంది చౌరస్తా, కార్గిల్ చౌరస్తా, గాంధీ రోడ్డు, జవహర్‌లాల్ రోడ్డు, కాల్వగడ్డ, బురుజు ప్రాంతం, అంబేద్కర్ నగర్ మీదుగా పట్టణ శివారులోని వాగు వరకు కొనసాగింది. వినాయక విగ్రహాలను శోభయాత్రగా తీసుకెళ్లి పట్టణ శివారులోని వాగులో నిమజ్జనం చేశారు. మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు ఆధ్వర్యంలో కోరుట్ల్ల, మెట్‌పల్లి సీఐలు సురేష్ బాబు, ఎస్‌ఐలు చిరంజీవి, రామచంద్రుడు, శ్రీకాంత్ బందోబస్తును నిర్వహించారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ హరీఫ్ అలీఖాన్‌లు ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించారు.
ఫఅలరించిన ఎలక్ట్రికల్ టాయిస్ వాహనాలు
గణేష్ నిమజ్జనోత్సవాలలో ఎలక్ట్రికల్ టాయిస్ వాహనాలు ఆకట్టుకున్నాయి. ఎలక్ట్రికల్ వాహనంలో చిన్న గణపతి ప్రతిమను ఉంచి రిమోండ్ కంట్రోల్ సహాయంతో వాహనం ముందుకు పోనిస్తూ యువకుడు ఆకట్టుకున్నాడు. గణపతి ప్రతిమను వాగులో నిమజ్జనం చేసి పలువురు మన్ననలు పొందాడు.
అలరించిన పల్లకి సేవ
కోరుట్ల పట్టణంలో బ్రాహ్మణసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నిమజనోత్సవం అలరింపజేసింది. శనివారం పట్టణంలో సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మట్టి గణపతిని ప్రత్యేకంగా అలకంరించి పల్లకిలో ఉంచి శోభా యాత్ర నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, తహసీల్దార్ ప్రత్యేక పూజలో పాల్గొని శోభయాత్రను ప్రారంభించారు.
కోరుట్ల మండలంలో...
ఫకోరుట్ల రూరల్: మండలంలోని పలు గ్రామాలలో వినాయక నిమజ్జన ఉత్సవాను ఘనంగా నిర్వహించారు. గ్రామాలలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలలో శోభయాత్ర నిర్వహించారు.
జగిత్యాల మండలంలో..
ఫజగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలంలోని హన్మాజీపేట, పొరండ్ల, తదితర గ్రామాల్లో శనివారం ఘనంగా గణనాథుల నిమజ్జన వేడుకలను నిర్వహించారు.
ఫమెట్‌పల్లి పట్టణంలో..
మెట్‌పల్లిటౌన్: పట్టణంలో వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నిమజ్జ ఉత్సవాల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా పట్టణంలోని వట్టివాగు వద్ద ఆర్డీఓ శ్రీనివాస్ పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. మెట్‌పల్లి డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో మెట్‌పల్లి ఎస్‌ఐ కిరణ్‌కుమార్ భారీ బందోబస్తు నిర్వహించారు.
ప్రశాంతంగా నిమజ్జనం
-కలెక్టర్ సత్యప్రసాద్
మెట్‌పల్లిటౌన్, సెప్టెంబర్ 6(ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిందని కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. శనివారం పట్టణంలోని వట్టి వాగు వద్ద నిమజ్జన ఏర్పాట్లను మెట్‌పల్లి ఆర్డీఓ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ రాములు, మున్సిపల్ కమిషనర్ మోహన్ పాల్గొన్నారు.
ఫమెట్‌పల్లి మండలంలో..
మెట్‌పల్లి రూరల్: మండలంలో వినాయకుడి నిమజ్జనం వైభవంగా నిర్వహించారు. అవాంఛ నీయ సంఘటనాలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మల్లాపూర్ మండలంలో..
ఫమల్లాపూర్: మల్లాపూర్‌తో పాటు ఆయా గ్రామాల్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. మల్లాపూర్ ఎస్సై రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
మల్యాల మండలంలో..
ఫమల్యాల: వినాయక నిమజ్జనోత్సవాలు మండలంలో శనివారం కూడా కొనసాగాయి. నృత్యాల చేస్తూ యువతీ, యువకులు గణనాథుడి శోభాయాత్ర నిర్వహించారు.
రాయికల్ మండలంలో..
ఫరాయికల్: రాయికల్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం వినాయక నిమజ్జనోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం పట్టణ శివారులోని చెరువులో గణనాథులను నిమజ్జనం చేశారు. ఎస్సై సుధీర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
గొల్లపల్లి మండలంలో..
గొల్లపల్లి: గొల్లపల్లి మండలంలో వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శోభాయాత్ర అనంతరం గణపతి ఉత్సవమూర్తులను ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలల్లో ఘనంగా నిమజ్జనం చేశారు. శ్రీరాముల పల్లె శ్రీ మహాంకాళి సేనా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు శనిగారపు మల్లేశం, నాయకులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శోభాయాత్ర
వెల్గటూర్: మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జనాన్ని వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన వాహనాలపై గణపయ్యను నిలిపి శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం సమీప జలాశయాలలో, మరి కొందరు గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఎస్సై ఉమాసాగర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.