Share News

ఆయిల్‌పామ్‌ సాగుపై అన్నదాతల ఆసక్తి

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:57 PM

జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు చేసే రైతులు ఆయిల్‌పామ్‌ను ఎంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి, దీర్ఘకాలికంగా ఆదాయాన్ని అందిస్తోంది. మరో వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పామ్‌ సాగుపై సబ్సిడీలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది.

ఆయిల్‌పామ్‌ సాగుపై   అన్నదాతల ఆసక్తి

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు చేసే రైతులు ఆయిల్‌పామ్‌ను ఎంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి, దీర్ఘకాలికంగా ఆదాయాన్ని అందిస్తోంది. మరో వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పామ్‌ సాగుపై సబ్సిడీలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. మూడేళ్ల క్రితం జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు గురించి రైతాంగానికి ఆవగాహన కల్పించడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో నర్సరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సుల్తానాబాద్‌ మండలం రెబ్బల్‌దేవ్‌పల్లిలో నర్సరీ ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి ఇందుకు సంబంధించిన మొక్కలు తెప్పించి నలభై ఎనిమిది ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలోని 14 మండలాల రైతులకు మొక్కలను పంపిణీ చేశారు. రైతులకు శాస్త్రవేత్తలు, ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులతో సలహాలు సూచనలు ఇప్పించారు. మొదట జిల్లాలో పదివేల ఎకరాలలో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. యేటా సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు.

జిల్లాలో ప్రయాగాత్మకంగా కొందరి భూముల్లో సాగు చేసిన ఆయిల్‌పామ్‌ పంట చేతికి వచ్చింది. ఇప్పటి వరకు రెండు కటింగ్‌లు చేపట్టిన రైతులకు ఉద్యాన శాఖాధికారులు సూచించిన మేరకు దిగుబడులు రావడంతో రైతులలో ఆనందం వెల్లివిరుస్తున్నది. 20 ఎకరాలలో సాగు చేయగా మంచి దిగుబడులు వచ్చాయి. ఆయిల్‌పామ్‌ గెలలను విక్రయించగా ఒక్కో టన్నుకు 18 వేల నుంచి 19 వేల రూపాయల పై చిలుకు ధర పలకడం గమనార్హం. ఇటీవల సాగు చేసిన ఆయిల్‌పామ్‌ పంటకు సంబంధించిన దిగుబడులు డిసెంబర్‌, ఫిబ్రవరి నెలలో ఆశించిన స్థాయిలో వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడేళ్లుగా ఉద్యాన, వ్యవసాయ శాఖాధికారులు రైతులను ప్రోత్సహిస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా 3200 ఎకరాలలో సాగు చేస్తున్నారు.

రైతులకు సబ్సిడీలు

జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగును మూడేళ్ల క్రితం చేపట్టారు. సుల్తానాబాద్‌ మండలం రెబ్బల్‌దేవ్‌పల్లిలో ఎస్సారెస్పీ కాలువ పక్కన దాదాపు 48 ఎకరాల విస్తీర్ణంలో తిరుమల ఆయిల్‌ కేమ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచింది. రైతులు సాగు చేసిన పంట దిగుబడులను కూడా తిరుమల ఆయిల్‌ కేమ్‌ కంపెనీ కొనుగోలు చేసింది. ఇటీవల కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెద్దరాతుపల్లి శివారులో ఆయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఆయిల్‌పామ్‌ గెలలను శుద్ధి చేసి ఆయిల్‌గా మార్చి ఆయా ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3,200 ఎకరాల్లో రైతులు పంట వేశారు. ఆయిల్‌ పామ్‌ సాగుపై ఆసక్తి చూపే ఎస్సీ రైతులకు వంద శాతం, బీసీలకు తొంభై శాతం చొప్పున సబ్సిడీలు ఇస్తున్నారు. అలాగే డ్రిప్‌కోసం అవసరమైన పెట్టుబడి మొత్తాన్ని అందించి నాలుగేళ్ల అనంతరం వాయిదాల రూపంలో కంపెనీ వారు వసూలు చేసుకుంటారు. ఇవే కాకుండా సాగు చేస్తున్న ఎకరాకు 4200 రూపాయల చొప్పున పెట్టుబడులు కూడా ఇస్తున్నారు. ఇలా చెల్లింపులు నాలుగేళ్ల వరకు ఉంటాయి. ఎకరానికి చతురస్రాకారంలో 50 మొక్కలు, త్రిభుజాకారంలో 57 మొక్కలు నాటుతారు. జిల్లాలో రైతులు ఆయిల్‌పామ్‌ సాగును లాభాదాయకమైన పంటగా భావిస్తున్నారు. టన్నుకు 18 నుంచి 20 వేలకు పైగా ధర పలుకుతుందంటున్నారు. ఇంకా బాగా చేస్తే మంచి దిగుబడులు వస్తాయని రైతులు భావిస్తున్నారు. ఆయిల్‌ పామ్‌ పంట సాగును అంతర పంటలు కూడా వేసుకోవచ్చని నర్సరీ మేనేజర్‌ శివ రైతులకు సూచిస్తున్నారు. మొక్కజొన్న, వేరుశనగ, పత్తితో ఇతర కూరగాయలను అంతర పంటగా సాగు చేసుకోవచ్చన్నారు. ఆయిల్‌ పామ్‌ ద్వారా దాదాపు 25 నుంచి 30 ఏళ్ల పాటు ఆదాయం వస్తుందని జిల్లా ఉద్యాన వన అధికారి జగన్మోహన్‌ రావు అన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 11:57 PM