జానపద కళలను భావితరాలకు అందించాలి
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:44 PM
జానపద కళలను భావితరాలకు అందించేలా ప్రభుత్వం కృషి చేయాలని జానపద సకలవృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని నందనగార్డెన్ ఆవరణలో ఆ సంఘం జిల్లా కళాకారుల సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జానపద కళలను భావితరాలకు అందించేలా ప్రభుత్వం కృషి చేయాలని జానపద సకలవృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని నందనగార్డెన్ ఆవరణలో ఆ సంఘం జిల్లా కళాకారుల సమావేశం నిర్వహించారు. ముందుగా రచయిత అందెశ్రీ అకాల మరణానికి రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం తాళ్లపల్లి సంధ్య మాట్లాడుతూ పల్లెల్లోపల్లె సిద్దులతో బతుకమ్మ బోనాలతో మన సంస్కృతిని ప్రతిబింబించేలా జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మన మట్టిలో కళ ఉందని, పెద్దపల్లి జిల్లా కళల కాణాచి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని, వృద్ధాప్య పెన్షన్లు అందించాలన్నారు. మార్చిలోగా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుంటే ఇందిరా పార్క్ వద్ద హలో కళాకారుడా ఛలో హైదరాబాద్ చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తున్నామన్నారు. సంఘ సేవకులు వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటుకు కళాకారుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. కళాకారులు లేకుండా ప్రస్తుతం ఏ కార్యక్రమాలు జరగడం లేదన్నారు. అలాంటి కళాకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు. ఆలయాల్లో కళా ప్రదర్శనకు కళాకారులకు అవకాశం కల్పించాలని, భాషా సాంస్కృతిక శాఖ ద్వారా జానపద కళలు పరీరక్షించేందుకు విద్యార్థులకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో పాటలు పాడి, ఆడి అలరించారు. కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ గోపగాని సారయ్యగౌడ్, జానపద సకలవృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర కోశాధికారి ఎద్దు మమత, కార్యవర్గ సభ్యులు కేశవేణి రమాదేవి, బూడిద అనసూయ, సీనియర్ కళాకారులు కొమురయ్య, నాంపల్లి సింధూజ, కందుకూరి లలిత, మల్లమ్మ, రమాదేవి, స్వామి, దివ్య, కొమురయ్య, అతిథులకు శాలువాతో సన్మానించారు. జిల్లా కన్వీనర్ కొమురయ్య, కో కన్వీనర్ గీత నర్సయ్య, జిల్లా కోఆర్డినేటర్‌గా కోండ్ర సునీత, సభ్యులు కొమురయ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.