Share News

వేములవాడలో పూల జాతర

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:02 AM

వేములవాడ మూలవాగు తీరంలో ఏడోద్దుల సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. తీరోక్క పూలతో రంగురంగుల బతుకమ్మలను అందంగా పేర్చుకుని తీసుకువచ్చిన మహిళలు, యువతులతో మూలవాగు బతుకమ్మ ఘాట్‌ జనసంద్రంగా మారింది. మహిళలకు మున్సిపల్‌ సిబ్బంది పూలను చల్లుతూ స్వాగతం పలికారు.

వేములవాడలో పూల జాతర

వేములవాడ కల్చరల్‌, సెప్టెంబరు 27 (ఆంరఽధజ్యోతి): వేములవాడ మూలవాగు తీరంలో ఏడోద్దుల సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. తీరోక్క పూలతో రంగురంగుల బతుకమ్మలను అందంగా పేర్చుకుని తీసుకువచ్చిన మహిళలు, యువతులతో మూలవాగు బతుకమ్మ ఘాట్‌ జనసంద్రంగా మారింది. మహిళలకు మున్సిపల్‌ సిబ్బంది పూలను చల్లుతూ స్వాగతం పలికారు. మూలవాగులో ఏర్పాటు చేసిన శివుడి భారీ విగ్రహం ముందు మహిళలు బతుకమ్మలను ఆడారు. మహిళలు ఆడిన కోలాటం, దండియా ఆటలు పలువురిని ఆకట్టుకున్నాయి. సాయినగర్‌లో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సతీమణి మాజీ జడ్పీటీసీ ఆది వనజ, బద్దిపోచమ్మ ఆలయ పరిసరాల్లో బీజేపి నేత ప్రతాప రామకృష్ణ సతీమణి మాజీ కౌన్సిలర్‌ ప్రతాప హిమబిందు స్థానిక మహిళతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం మూలవాగులో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్‌లో, మూలవాగులోని నీటిలో బతుకమ్మలు నిమజ్జనం చేసి పసుపు రాసుకుంటూ.. వాయినం ఇచ్చి పుచ్చుకున్నారు. వెంట తీసుకువెళ్లిన సద్దులను ఒకరికి ఒకరు పంచిపెట్టుకుని ఆరగించారు. చిన్నపాటి వర్షం పడినప్పటికి మహిళలు బతుకమ్మ ఆడారు.

రాజన్న ఆలయంలో ఆకట్టుకున్న మహిళల ఆటపాటలు..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో బతుకమ్మ వేడుకలు ఏడు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈవో రమాదేవి ఆధ్వర్యంలో ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. పట్టణానికి చెందిన మహిళలు ఆలయానికి తరలివచ్చి బతుకమ్మ ఆడి వద్ద కోలాటం, దండియా ఆటలాడడం ఆకట్టుకున్నాయి. అనంతరం ధర్మగుండంలో బతుకమ్మలను నిమజ్జనం చేసి వాయినం ఇచ్చిపుచ్చుకున్నారు.

వేడుకలకు హాజరైన ప్రముఖులు..

వేములవాడ పట్టణంలోని సద్దుల బతుకమ్మ సంబరాలకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మఖ్యఅతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ ఘాట్‌ వద్దకు వచ్చిన ఆది శ్రీనివాస్‌ ఎస్పీ మహేష్‌ బి. గితే, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డిలతో కలిసి బెలున్‌ ఎగరవేసి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. అనంతరం మూలవాగులో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్‌ వద్దకు వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అలాగే సంబరాల్లో ప్రజాగాయకురాలు, బహుజన బతుకమ్మ రాష్ట్ర కన్వీనర్‌ విమలక్క, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మదేవందర్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, సిరిసిల్ల జిల్లా మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, సుశీలరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి తదితరులు సంబరాల్లో పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 01:02 AM