ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:49 PM
అంతర్గాం మండల పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన గల కడెం ప్రాజెక్టు, వాగులు, వంకలు ద్వారా వరద నీరు చేరుతోంది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతోంది.
అంతర్గాం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): అంతర్గాం మండల పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన గల కడెం ప్రాజెక్టు, వాగులు, వంకలు ద్వారా వరద నీరు చేరుతోంది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతోంది. రాత్రి 11 గంటల సమయానికి ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 148.00 మీటర్లకు గాను ప్రస్తుతం 147.24 మీటర్లకు నీరు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 18.063 టీంఎసీల నీరు నిలువ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 2,11,817 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 2,11,817 క్యూసెక్కులు ఉండగా, హైద్రా బాద్ మెట్రోపాలిటన్ వాటర్ స్కీం కోసం 286 క్యూసెక్కులు, ఎన్టీపీసీ అవసరాలకు 121 క్యూసెక్కులు, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నం దిమేడారంలోని నంది పంప్ హౌజ్‌కు 9,450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కడెం గేట్లు ఎత్తివేత....
కడెం రిజర్వాయర్‌కు ఉన్న18 గేట్లలో 14 గేట్లు తెరిచి 1,07,161 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో నీరు చేరడంతో రాత్రి వరకు 20 గేట్లను ఎత్తి 2,01,960 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు దీంతో గోదావరి సమీప ప్రాంతానికి ఎవరు వెళ్లవద్దని, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
కొనసాగుతున్న ఎత్తిపోతలు
ధర్మారం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద నీరు చేరుతుండడంతో ఐదు రోజలుగా నంది మేడారంలోని నంది పంప్‌హౌజ్ ద్వారా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. రోజు ఉదయం 7-30 గంటల నుంచి సాయంత్రం 5-30 గంటల వరకు 3 పంపుల ద్వారా 9450 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఏవైన మార్పులు ఉంటే మినహా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆదివారం వరకు ఎత్తిపోతలు కొనసాగుతాయని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.