Share News

మద్యం టెండర్లకు అరకొర దరఖాస్తులు

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:30 PM

వైన్‌ షాపు టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదలై 15 రోజులు దాటినా అరకొరగానే దరఖాస్తులు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు నవంబర్‌ 30తో ముగియనుంది. దీంతో 2025-2027 సంవత్సరానికి గాను కొత్త లైసెన్సుల జారీకి ప్రభుత్వం గత నెల 25న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ మరుసటి రోజు నుంచే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లాలో 74 మద్యం షాపుల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించారు.

మద్యం టెండర్లకు  అరకొర దరఖాస్తులు

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): వైన్‌ షాపు టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదలై 15 రోజులు దాటినా అరకొరగానే దరఖాస్తులు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు నవంబర్‌ 30తో ముగియనుంది. దీంతో 2025-2027 సంవత్సరానికి గాను కొత్త లైసెన్సుల జారీకి ప్రభుత్వం గత నెల 25న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ మరుసటి రోజు నుంచే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లాలో 74 మద్యం షాపుల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించారు.

మున్సిపాలిటీ పరిధిలో లక్కీ డ్రాలో ఎంపికైన వైన్స్‌ షాపు నిర్వాహకులు వార్డులు తేడా లేకుండా ఎక్కడైనా షాపు ఏర్పాటు చేసుకునే అవకాశం ఈసారి అబ్కారీ శాఖ కల్పించింది. గ్రామాల్లో నేషనల్‌ హైవేలు ఉంటే 220 మీటర్ల దూరంలో షాపు ఏర్పాటు చేసుకోవచ్చనే పాత పద్ధతి అమలు చేస్తున్నారు. గత నెల 26 ప్రారంభమైన దరఖాసుల ప్రక్రియ ఈ నెల 18 వరకు కొనసాగుతోంది. అయితే ఈసారి దరఖాస్తులు పెద్దగా రాకపోవడంతో ఎక్సైజ్‌ అధికారులు రియల్‌ ఎస్టేట్‌, గ్రానైట్‌, రైస్‌మిల్‌ అసోసియేషన్‌, బంగారు వ్యాపారస్తులు, మెడికల్‌ అసోసియేషన్‌, హార్డ్‌వేర్‌ వ్యాపారస్తులపై దృష్టి సారించి వైన్స్‌ షాపుల దరఖాస్తులు చేసుకోవడంపై అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికి మందకొడిగా దరఖాస్తులు వస్తున్నాయి. 2023-25లో మొత్తం 2022 దరఖాస్తులు వచ్చాయని కేవలం చివరి రెండు రోజుల్లో 1583 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గత నెల 26 నుంచి ఇప్పటి వరకు 74 దరఖాస్తులు రాగా సోమవారం 25 దరఖాస్తులు వచ్చినట్లు సీఐ నాగేశ్వర్‌రావు తెలిపారు. చివరి రెండు రోజులు 17, 18 తేదీల్లో అధిక దరఖాస్తులు వస్తాయని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలు కారణమే

స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ ఉండడం కూడా దరఖాస్తుల తక్కువ రావడానికి ఒక కారణంగా చెపుకోవచ్చు. అయితే అప్పటి వరకు రోజుకు ఒక్కటి రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఎన్నికల వాయిదా అనంతరం కొంత దరఖాస్తుల సంఖ్య ఊపందుకుంటుంది. మద్యం వ్యాపారస్తులు మాత్రం ఆచితూచి అడుగు వేస్తుంటారు. దరఖాస్తులు ఎన్ని వస్తున్నాయని పరిశీలించాక ఆయా గెజిట్‌ నంబర్లపై దరఖాస్తు చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారు.

దరఖాస్తులు పెరుగుతాయి

ఎక్సైజ్‌ సీఐ నాగేశ్వర్‌రావు

ధరఖాస్తులు తగ్గుతున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. దరఖాస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఎప్పటిలాగే చివరి రెండు రోజుల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయి. మున్సిపాల్టీలో వైన్స్‌ దక్కించకున్న వారు మున్సిపల్‌ పరిధిలో ఎక్కడైన ఏర్పాటు చేసుకోవచ్చు.

Updated Date - Oct 13 , 2025 | 11:30 PM