యూరియా కోసం రైతుల తోపులాట
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:25 AM
సుల్తానాబాద్ సహకార సంఘం గోదాముల వద్ద యూరియా కోసం రైతుల మధ్య శుక్రవారం తోపులాట చోటు చేసుకుంది. గోదాంకు వచ్చిన యూరియా నిల్వల కోసం రైతులు ఉదయం నుంచి క్యూ లైన్‌లో నిలబడి వేచి ఉండగా, ఒకరిద్దరు రైతులు డైరెక్ట్‌గా కౌంటర్ వద్దకు వెళ్లడాన్ని లైన్‌లో నిల్చున్న రైతులు ఆక్షేపించారు.
సుల్తానాబాద్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ సహకార సంఘం గోదాముల వద్ద యూరియా కోసం రైతుల మధ్య శుక్రవారం తోపులాట చోటు చేసుకుంది. గోదాంకు వచ్చిన యూరియా నిల్వల కోసం రైతులు ఉదయం నుంచి క్యూ లైన్‌లో నిలబడి వేచి ఉండగా, ఒకరిద్దరు రైతులు డైరెక్ట్‌గా కౌంటర్ వద్దకు వెళ్లడాన్ని లైన్‌లో నిల్చున్న రైతులు ఆక్షేపించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక దశలో గొడవ పెద్దది కావడంతో పోలీసులు వచ్చి వారిని శాంతింప చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియాను అందించాలని కోరుతున్నారు.
ఓదెల, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో శుక్రవారం రైతులు యూరియా కోసం రెవెన్యూ కార్యాలయానికి తరలి వెళ్లారు. ఓదెల గ్రామానికి వంద బస్తాలు రాగా 200 మంది రైతులు రైతువేదిక వద్దకు టోకెన్ల కోసం వెళ్లారు. దీంతో వచ్చిన బస్తాలకు సరిపడ ఏఈఓ టోకెన్లు రైతులకు ఇవ్వడంతో, మిగతా రైతులు బస్తాలు కావాలని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లారు. తహసీల్దార్ ధీరజ్‌కుమార్ రైతులతో మాట్లాడుతూ సోమవారం 450 యూరియా బస్తాలు వస్తాయని, ఎవరు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. అధికారులు స్పందించి రైతులకు సరిపడు బస్తాలను తెప్పించాలని రైతులు అధికారులను కోరారు.