గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను అడ్డుకున్న రైతులు
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:57 PM
పరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభించవద్దని రైతులు బుధవారం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను అడ్డుకున్నారు. పోతారం-కేశనపల్లి వద్ద జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను అధికారులు సందర్శించిన క్రమంలో రైతులు అడ్డుకుని నష్టపరిహారం చెల్లించే వరకు పనులు ప్రారంభించేది లేదన్నారు.
ముత్తారం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): పరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభించవద్దని రైతులు బుధవారం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను అడ్డుకున్నారు. పోతారం-కేశనపల్లి వద్ద జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను అధికారులు సందర్శించిన క్రమంలో రైతులు అడ్డుకుని నష్టపరిహారం చెల్లించే వరకు పనులు ప్రారంభించేది లేదన్నారు. యంత్రాలను అడ్డుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ రవికుమార్ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ వారికి హామీ ఇచ్చారు.
మంథనిరూరల్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పుట్టపాక వద్ద నేషనల్ హైవే పనులలో నిర్వాసితులుగా మారుతున్న రైతులకు మూడు రోజులలో పూర్తి పరిహారం చెల్లిస్తామని ఆర్డీవో సురేష్ తెలిపారు. పుట్టపాక వద్ద అధికారులు బుధవారం పనులు నిర్వహించారు. కొందరికి పూర్తి పరిహారం అందక పోవడంతో పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించగా తహసీల్దార్ కుమారస్వామి ఆర్డీవో సురేష్ వద్దకు పంపించారు. రైతులతో మాట్లాడిన ఆర్డీవో నిర్వాసిత రైతులకు మూడు రోజులలో పరిహారం అందజేస్తామని తెలిపారు. దీంతో హైవే పనులు యథావిధిగా కొనసాగాయి.