యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:29 AM
యూరియా కోసం మంథనిలో అన్నదాతలు సోమవారం ఆందోళనకు దిగారు. యూరియా బస్తా పంపిణీలో వ్యవసాయాధికారులు, ఫెర్టిలైజర్స్ షాపుల యజమానుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ చౌక్‌లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
మంథని, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం మంథనిలో అన్నదాతలు సోమవారం ఆందోళనకు దిగారు. యూరియా బస్తా పంపిణీలో వ్యవసాయాధికారులు, ఫెర్టిలైజర్స్ షాపుల యజమానుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ చౌక్‌లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. పనులు వదిలి పెట్టుకొని రోజుల తరబడి యూరియా కోసం మంథనికి వస్తే వ్యవసాయాధికారులు, ఫెర్టిలైజర్, రైతు సేవా కేంద్రాల నిర్వాహకులు తమను పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు నెపం పెడుతూ తమకు యూరియాను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు చెందాల్సిన యూరియాను అధికారులు, వ్యాపారులు కుమ్మకై బ్లాక్ మార్కెట్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతుల ఆందోళన కారణంగా రాకపోకల అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రైతులకు నచ్చజెప్పడంతో పాటు ఏడీఏ అంజనీ వచ్చి యూరియా బస్తాలు అందరికి అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు అందోళన విరమించారు. రైతులకు మద్దతుగా ప్రజా సంఘాల నేతలు బూడిద గణేష్, మంథని లింగయ్య, ఆర్ల సందీప్‌లు పాల్గొన్నారు. యూరియా కోసం ఇప్పటికే వారంలో మూడు సార్లు రైతులు ఆందోళనకు దిగారు.