యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:51 PM
కేంద్ర ప్రభుత్వం సకాలంలో యూరియా సరఫరా చేయని కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు సరిపడా యూరియా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు.
పెద్దపల్లి, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం సకాలంలో యూరియా సరఫరా చేయని కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు సరిపడా యూరియా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న యూరియా నిల్వల గురించి తెలుసుకున్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో యూరియా నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. కొందరు ప్రతిపక్ష నాయకుల కుట్రలతో యూరియాపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు యూరియా అందేలా చూడాలన్నారు. పైవ్రేట్ డీలర్ల వద్ద నిల్వలను తనిఖీ చేస్తూ రైతులకు సరఫరా చేసేలా చూడాలన్నారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ చేసి యూరియా అవసరాలను వివరించారు. యూరియా పంపిణీకి మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, పెద్దపల్లి ఏడీఏ శ్రీనాథ్, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.