Share News

యూరియా కోసం రైతుల ఆందోళన

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:07 AM

యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం కాసులపల్లిలోని ఓ ఫర్టిలైజర్‌, డిసిఎంఎస్‌ డీలర్‌ వద్దకు యూరియా లోడ్‌తో లారీ వచ్చింది. దుకాణ యజమాని వ్యవసాయ శాఖ అధికారులతో మంతనాలు జరుపుతుండటంతో రైతులు ఆగ్రహానికి గురై షట్టర్‌ను తెరిచి యూరియా ఇస్తారా లేదా అంటూ నిలదీశారు.

యూరియా కోసం రైతుల  ఆందోళన

పెద్దపల్లి రూరల్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం కాసులపల్లిలోని ఓ ఫర్టిలైజర్‌, డిసిఎంఎస్‌ డీలర్‌ వద్దకు యూరియా లోడ్‌తో లారీ వచ్చింది. దుకాణ యజమాని వ్యవసాయ శాఖ అధికారులతో మంతనాలు జరుపుతుండటంతో రైతులు ఆగ్రహానికి గురై షట్టర్‌ను తెరిచి యూరియా ఇస్తారా లేదా అంటూ నిలదీశారు. స్థానిక రైతులకు యూరియా కావాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని, సగం లారీ ఇతర ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొనడంతో అడ్డుకున్నట్లు తెలిపారు. ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లి అడిగితే ఇతర మందులను అంటకడుతూ యూరియా బస్తాకు రూ.350 ఇస్తామని అంటున్నారని పేర్కొన్నారు. ఎరువుల దుకాణాల యజమానులు బిల్లులు ఇవ్వడం లేదన్నారు. నానో యూరియా వాడితే పంట ఎదగడం లేదన్నారు. రైతులకు కావాల్సిన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందిస్తామని అధికారులు హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

యూరియా కోసం రోడ్డెక్కిన మహిళా రైతులు

జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం మహిళా రైతులు రోడ్డెక్కారు. పెద్దాపూర్‌ గ్రామంలో ఆ గ్రామానికి చెందిన మహిళలు రైతులు రోడ్డెక్కి యూరియా లారీలను అడ్డుకున్నారు. జూలపల్లి సహకార సంఘం ఆద్వర్యంలో పెద్దాపూర్‌, కుమ్మరికుంట గ్రామాల రైతులకు యూరియా పంపిణీ చేసేందుకు సహకార సంఘం అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్దాపూర్‌, కుమ్మరికుంట గ్రామాల రైతులకు 450 బస్తాలను పంపిణీ చేసేందుకు లారీ గ్రామానికి చేరుకుంది. మొత్తం 450 బస్తాలను పెద్దాపూర్‌ గ్రామ రైతులకు పంపిణీ చేయాలని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్దాపూర్‌ గ్రామ రైతులకు 225 యూరియా బస్తాలను పంపిణీ చేసి అనంతరం కుమ్మరికుంట గ్రామానికి తరలించి అక్కడి రైతులకు 225 బస్తాలను పంపిణీ చేసినట్లు సహకార సంఘం కార్యదర్శి గీస సురేష్‌ తెలిపారు.

Updated Date - Sep 10 , 2025 | 12:07 AM