యూరియా కోసం రైతుల ఆందోళన
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:53 PM
సుల్తానాబాద్‌లో రైతులు యూరియా కోసం ఆందోళన నిర్వహించారు. కొన్ని రోజులుగా సహకార సంఘం గోదాం వద్ద యూరియా పంపిణీ జరుగుతున్నది. శనివారం యూరియా లోడ్ రావడంతో రైతులు ఉదయం నుంచే గోదాం వద్ద బారులు తీరారు. గంటల కొద్ది నిరీక్షించారు.
సుల్తానాబాద్, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌లో రైతులు యూరియా కోసం ఆందోళన నిర్వహించారు. కొన్ని రోజులుగా సహకార సంఘం గోదాం వద్ద యూరియా పంపిణీ జరుగుతున్నది. శనివారం యూరియా లోడ్ రావడంతో రైతులు ఉదయం నుంచే గోదాం వద్ద బారులు తీరారు. గంటల కొద్ది నిరీక్షించారు. యూరియా బస్తాల కోసం ఎగబడ్డారు. రైతుల మధ్యనే గొడవ పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రవణ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు. గోదాములో నిల్వ మేరకు లైన్‌లో ఉన్న రైతులందరికి ఒకటి, రెండు చొప్పున పంపిణీ చేశారు. ఈ విషయమై సహకార సంఘం సీఈఓ బూర్గు సంతోష్ మాట్లాడుతూ వారం రోజులుగా యూరియా నిలువలు రాలేదన్నారు. ప్రస్తుతం 340 బస్తాల యూరియా గోదాంకు చేరిందని, విషయం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో నిల్వల మేరకు వాటిని పంపిణీ చేశామన్నారు. త్వరలో మరిన్ని బస్తాలు వస్తాయని, అందరికి సర్దుబాటు చేస్తామని ఆయన తెలిపారు.
ఎరువుల కోసం చెప్పులతో క్యూలైనులు
కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెగడపల్లి గ్రామంలో శనివారం ఎరువుల కోసం రైతులు తరలివచ్చారు. ఎరువులు వచ్చాయనే సమాచారంతో రైతులు క్యూలో చెప్పులు పెట్టారు. రైతులకు ఎరువులు అందించేందుకు దుకాణదారులు సిద్ధం కావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. రైతులకు ఎరువులు అందించినా సాగుకు సరిపోని విధంగా ఇస్తున్నారని వాపోయారు. కాగా 200 బస్తాలు వచ్చాయని, అందరికీ అందజేశామని పేర్కొన్నారు.