Share News

నష్ట పరిహారం కోసం రైతుల ఆందోళన

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:54 PM

మండలంలోని పుట్టపాక గ్రామంలో భూములకు పరిహారం చెల్లించకుండా గ్రీన్‌పీల్డ్‌ హైవే రోడ్డు పనులు చేస్తుండగా బాధిత రైతులు బుధవారం అడ్డుకున్నారు. పరిహారం చెల్లించకుండానే వేసిన పత్తి పంటలను అధికారులు తొలగిస్తుండగా యంత్రాలకు అడ్డంగా రైతులు ఆందోళన చేపట్టారు. పరిహారం చెల్లించకుండా వేసిన పంటలను తొలగించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నష్ట పరిహారం కోసం రైతుల ఆందోళన

మంథని/మంథనిరూరల్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పుట్టపాక గ్రామంలో భూములకు పరిహారం చెల్లించకుండా గ్రీన్‌పీల్డ్‌ హైవే రోడ్డు పనులు చేస్తుండగా బాధిత రైతులు బుధవారం అడ్డుకున్నారు. పరిహారం చెల్లించకుండానే వేసిన పత్తి పంటలను అధికారులు తొలగిస్తుండగా యంత్రాలకు అడ్డంగా రైతులు ఆందోళన చేపట్టారు. పరిహారం చెల్లించకుండా వేసిన పంటలను తొలగించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 నెలల క్రితం కలెక్టర్‌ పుట్టపాక గ్రామ పంచాయతీకి వచ్చి నిర్వాసిత రైతుల అకౌంట్ల డబ్బులు వేస్తామని మాట ఇచ్చారని బాధిత రైతులు వెల్లడించారు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. తమకు పూర్తి స్థాయిలో నష్ట పరిహారం చెల్లించకుండా పనులు చేయడం ఏమిటని ప్రశ్నిచారు. భూముల కోసం సంతకం చేసే వరకు ఒకరకంగా, తరువాత అధికారులు మమ్ముల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించిన తరువాత పనులు నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు.

రైతుల ఆందోళన వద్దకు వచ్చిన గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌ రైతులతో మాట్లాడుతూ.. పరిహారం వచ్చే విధంగా సహకరిస్తామని వారికి నచ్చజెప్పారు. గ్రామానికి చెందిన ఇసంపల్లి రాధమ్మ అనే వృద్ధురాలి పేరు మీద ఉన్న 16 గుంటల భూమికి అధికారులు అవార్డు పాస్‌ చేయకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా ఆమె భూమిలో పత్తి పంటను తొలిగించేందుకు సిద్ధపడగా అమె కుమారుడు చంద్రమూర్తి ఎక్స్‌కావేటర్‌కు అడ్డుగా పడుకున్నాడు. పోలీసులు చంద్రమూర్తిని, ఆయన భార్య సువర్ణ, తల్లి రాధమ్మతో పాటు ఇద్దరు పిల్లలను మంథని ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. అక్కడికి వచ్చిన కలెక్టర్‌ కోయ శ్రీహర్ష బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.

Updated Date - Sep 24 , 2025 | 11:54 PM