Share News

‘స్థానిక’ రిజర్వేషన్లకు కసరత్తు

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:51 PM

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అధికారులు కసరత్తు ఆరంభించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం జీవో విడుదల చేసి ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

‘స్థానిక’ రిజర్వేషన్లకు కసరత్తు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అధికారులు కసరత్తు ఆరంభించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం జీవో విడుదల చేసి ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీలకు ఎప్పటి లాగానే 2011 జనాభా లెక్కలను అనుసరించి, బీసీ రిజ ర్వేషన్లను 2024లో ప్రభుత్వం చేపట్టిన కులగణన లెక్కల ఆధారంగా బీసీల జనాభాను తీసుకుని చేయాలని ప్రభు త్వం ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్‌డీఓలు, ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి పలు సూచనలు చేసినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం ప్రభుత్వానికి పంపించాల్సి ఉండడంతో కలెక్టరేట్‌లోనే రాత్రి వరకు అధికార యంత్రాంగం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ చేపట్టారు. కులగణన సర్వే లెక్కలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టినప్పటికీ, జిల్లాల వారీగా లెక్కలను విడుదల చేయలేదు. అందులో జిల్లాల వారీగా తేలిన బీసీల జనాభా లెక్కలను ప్రభుత్వం జిల్లాలకు పంపించినట్లు తెలుస్తు న్నది. అయితే అధికారులు వాటి గురించి వెల్లడించడం లేదు. వాటి ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో జీవో విడుదల చేయవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నెలాఖరు, వచ్చే నెల మొదటి వారంలో గ్రామ పంచాయతీల లేదా మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ ఏదో ఒకటి విడుదల చేసే అవకాశాలున్నాయి. స్థానిక సంస్థలకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై ప్రభు త్వం తీసుకవచ్చిన ఆర్డినెన్స్‌లు, రెండు బిల్లులపై రాష్ట్రపతి ఆమోదం లభించలేదు. దీంతో జీఓ తీసుకవచ్చి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ఫ రొటేషన్ల ప్రకారమే రిజర్వేషన్లు...

రొటేషన్ల ప్రకారమే రిజర్వేషన్లు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019లో జరిగిన పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లను పదేళ్లకో సారి చేపట్టాలని చట్టంలో పేర్కొన్నారు. దానికి ప్రస్తుతం ప్రభుత్వం గతంలో వలే ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు రొటేషన్‌ చేయాలని చట్ట సవరణ చేసింది. జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు, 2,432 వార్డులు, 137 ఎంపీటీసీ స్థానాలు, 13 ఎంపీపీ, 13 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 4,04,181 మంది ఉండగా, ఇందులో పురుషులు 1,98,728 మంది, మహిళలు 2,05,438 మంది, ఇతరులు 14 మంది ఉన్నారు. చట్ట సవరణ చేయడం వల్ల గత ఎన్నికల్లో ఏదైతే రిజర్వేషన్‌ వచ్చిందో ఈసారి రాదు. ఉదా హరణకు సర్పంచ్‌ బీసీ జనరల్‌కు కేటాయిస్తే, ఈసారి బీసీ మహిళకు గానీ, ఇతర ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గానీ, జనరల్‌ గానీ కేటాయించవచ్చు.

ఫ రిజర్వేషన్లు ఇలా..

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్‌ స్థానాలకు రిజర్వేషన్లను ఆర్‌డీఓ ఖరారు చేస్తారు. మండ లాన్ని యూనిట్‌గా తీసుకుని ముందుగా ఎస్సీ, ఎస్టీ జనా భా ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించి, బీసీ రిజర్వేషన్లను బీసీ జనాభా ప్రకారం తీస్తారు. మిగిలిన స్థానాలను జనరల్‌కు కేటాయిస్తారు. మహిళలకు 50 శాతం సీట్లను డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. వార్డు స్థానాలకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఎంపీడీఓలు నిర్ణయిస్తారు. రిజర్వేషన్లు ఖరారు చేయడంలో రొటేషన్‌ను అనుసరిస్తారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు నిర్ణయిం చారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ప్రకారం, బీసీలకు ఓటర్ల సంఖ్య ప్రకారం నిర్ణయించారు. ఎంపీటీసీ స్థానాలకు కూడా రిజర్వేషన్లను ఆర్‌డీఓ నిర్ణయిస్తారు. ఎంపీపీ, జడ్పీ టీసీ స్థానాలకు జిల్లాను యూనిట్‌గా తీసుకుని కలెక్టర్‌ ఖరారు చేయనున్నారు. జడ్పీ చైర్మన్‌ స్థానాలను రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 7,95,332 జనాభా ఉం డగా, పురుషులు 3,99,325 మంది, మహిళలు 3,96,007 మంది, ఎస్సీల జనాభా 1,54,855 మంది, పురుషులు 77,311 మంది, మహిళలు 77,544 మంది ఉన్నారు. ఎస్టీల జనాభా 14,945 మంది ఉండగా, పురుషులు 7,520 మంది, మహిళలు 7,425 మంది ఉన్నారు. ఈలెక్కల ప్రకారం ముందుగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ప్రభుత్వం తీసుక వచ్చే జీఓ ప్రకారమే బీసీల జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. జీఓపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే, కోర్టు దానిని నిలిపి వేస్తే మాత్రం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చేసే అవకాశాలు న్నాయి. రిజర్వేషన్ల కోసం మండలాల వారీగా అధికార యంత్రాంగం కంప్యూటర్లలో నమోదు చేస్తున్నారు. రెండు రకాల రిజర్వేషన్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - Sep 22 , 2025 | 11:51 PM