పత్తి రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చూడాలి
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:57 PM
పత్తి పంటకు కనీస మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఈ సీజన్‌లో 48,215 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారని తద్వారా 5,78,580 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందన్నారు.
పెద్దపల్లి, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): పత్తి పంటకు కనీస మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఈ సీజన్‌లో 48,215 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారని తద్వారా 5,78,580 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందన్నారు. అక్టోబర్ 15 నుంచి మార్కెట్లకు పత్తి పంట వస్తుందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 8 శాతం తేమకు మించకుంటే కనీస మద్దతు ధర క్వింటాలుకు 8,110 రూపాయలు చెల్లించాలని అన్నారు. జిల్లాలో 5 చోట్ల సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశామని, మార్కెట్లలో మద్దతు ధర దక్కకుంటే రైతులను సీసీఐ కేంద్రాలకు పంపించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు పత్తి పంట తీసుకొని వచ్చే రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. బ్యాంకు ఖాతాతో ఆధార్ కార్డుతో లింకు చేయాలని కప్పాస్ కిసాన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. పత్తి అమ్మకానికి తీసుక వచ్చే ముందు యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ధర కంటే తక్కువకు పత్తి పంట అమ్మవద్దని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ప్రైవేట్ వ్యాపారుల వద్ద మద్దతు ధర లభించని పక్షంలో నేరుగా జిన్నింగ్ మిల్లులకు వచ్చి పత్తి పంట అమ్ముకోవాలని కలెక్టర్ సూచించారు. డీఎంఓ ప్రవీణ్ రెడ్డి, డీఏఓ శ్రీనివాస్, ఆర్‌టీఓ రంగారావు, జిల్లా తూనికల కొలతల అధికారి, మార్కెట్ కార్యదర్శులు, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.