Share News

జోరుగా ఉపాధిహామీ పనుల జాతర

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:58 AM

జిల్లాలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధిహామీ పనుల జాతర-2025 కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలులో భాగంగా పల్లెల్లో నివసిస్తున్న నిరుపేద కూలీల జీవనోపాధి మెరుగుపరచడానికి, ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల పని కల్పించడానికి వివిధ రకాల పనులు చేపట్టారు.

జోరుగా ఉపాధిహామీ పనుల జాతర

జగిత్యాల, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధిహామీ పనుల జాతర-2025 కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలులో భాగంగా పల్లెల్లో నివసిస్తున్న నిరుపేద కూలీల జీవనోపాధి మెరుగుపరచడానికి, ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల పని కల్పించడానికి వివిధ రకాల పనులు చేపట్టారు. జిల్లాలో రెండో విడతగా ఈ పనులు ప్రారంభించడమే కాకుండా కొత్త పనులకు భూమి పూజ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.

ఫపనులకు మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యేలు శంకుస్థాపన

పనుల జాతర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రూ.39,11,88,176 నిధులతో 3,591 పనులు చేపడుతున్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ పనులు ప్రారంభం కాగా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌లు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. జిల్లాలో రూ.7.28 కోట్లతో 809 పశువుల పాకలు, రూ.99 లక్షలతో 33 కోళ్ల పారాలు, రూ.98 లక్షలతో 116 గొర్రెల షెడ్లు, రూ. 14 లక్షలతో 72 వర్మీ నాడెప్‌ కంపోస్టు గుంతలు, రూ.80 లక్షలతో 16 చెక్‌ డ్యామ్‌లు, రూ.75 లక్షలతో 1,154 వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టనున్నారు. రూ. 1.05 కోట్లతో 658 అజోలా సాగు యూనిట్లు, రూ.1.80 కోట్లతో 145 హార్టికల్చర్‌ ప్లాంటేషన్‌లు, రూ.4.16 కోట్లతో 448 కమ్యూనిటీ డైన్‌ అండ్‌ సోక్‌ పిట్స్‌, రూ.1.92 కోట్లతో 3 ప్లాస్టిక్‌ వేస్ట్‌ యూనిట్స్‌, రూ.54 లక్షలతో 18 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, రూ.76 లక్షలతో 64 అంగన్‌వాడీ భవనాలు, రూ.1.10 కోట్లతో 55 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణాలు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఈ పనులతో పాటు ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి పనుల జాతరలో మరిన్ని పనులు చేపట్టి పూర్తి చేయాలని కార్యాచరణ రూపొందించారు. పశువులు, గొర్ల షెడ్లు, కోళ్ల ఫామ్‌లు, కొత్త వ్యవసాయ బావుల నిర్మాణం, వన మహోత్సవం ద్వారా ఈత, తాటి, పండ్ల తోటల పెంపకం, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నారు.

ఫమెరుగవనున్న పాలన...

గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిన అనంతరం పల్లె పాలన పడకేసిందన్న అభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్నప్పటికీ నిధుల కొరత వల్ల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. ఈనెల 22న ప్రభుత్వం చేపట్టిన పనుల జాతరతో పల్లెల్లో నూతన పనులు ప్రారంభమై పాలన మరింత మెరుపడనుంది. ఓ వైపు అభివృద్ధి పనులే కాకుండా వ్యక్తిగతంగా ఉపాధిహామీ కూలీలకు ఉపాధి దొరకనుంది.

గ్రామీణ ప్రజల ఉపాధి కోసమే..

-అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి

గ్రామీణ ప్రజల జీవనోపాధిని పెంచడానికి ప్రభుత్వం పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధిహామీ పథకం పనుల జాతర కార్యక్రమం నిర్వహిస్తోంది. పనుల జాతర కింద కోట్ల నిధులు వెచ్చించి వేల సంఖ్యలో పలు పనులు చేపడుతున్నాం. పల్లె జాతరను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

ప్రభుత్వ లక్ష్యం మేరకు పూర్తి చేస్తాం

-మదన్‌మోహన్‌, ఈజీఎస్‌ ఏపీడీ

ప్రభుత్వ లక్ష్యం మేరకు ఈజీఎస్‌ కింద పనులను పూర్తి చేస్తాం. ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా రూ.39.11 కోట్లతో 3,591 పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. అన్ని వర్గాల భాగస్వామ్యంతో లక్ష్యం సాధిస్తాం.

జిల్లా సమాచారం..

-------------------------------------------------------

మండలాలు...20

గ్రామ పంచాయతీలు..380

ఈజీఎస్‌ జాబ్‌ కార్డులు...1.67 లక్షలు

మొత్తం కూలీల సంఖ్య..2.73 లక్షలు

Updated Date - Aug 24 , 2025 | 12:58 AM