Share News

ఎన్టీపీసీలో ఎన్నికల నగారా

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:25 AM

రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు ఎన్నికలకు ప్రాజెక్టులోని వివిధ యూనియన్లు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబరు 25న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రాజెక్టులోని వివిధ యూనియన్లలో కదలిక వచ్చింది. మూడేళ్లకు ఒకసారి జరిగే ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి 2022 సెప్టెంబరు 19న ఎన్నికలు జరిగాయి.

ఎన్టీపీసీలో ఎన్నికల నగారా

జ్యోతినగర్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు ఎన్నికలకు ప్రాజెక్టులోని వివిధ యూనియన్లు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబరు 25న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రాజెక్టులోని వివిధ యూనియన్లలో కదలిక వచ్చింది. మూడేళ్లకు ఒకసారి జరిగే ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి 2022 సెప్టెంబరు 19న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో ఐఎన్‌టియుసి అనుబంధ మజ్దూర్‌ యూనియన్‌ విజయం సాధించింది. ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికలలో గెలిచిన యూనియన్‌ 60 శాతం కన్నా తక్కువ శాతం ఓట్లు నమోదు చేస్తే రెండో స్థానంలో నిలిచిన సంఘానికి కూడా రెండో ప్రాధాన్యత సంఘంగా యాజమాన్యం గుర్తింపునిస్తుంది. నెల రోజుల్లో జరగనున్న గుర్తింపు ఎన్నికలలో మరోసారి గెలిచేందుకు మజ్దూర్‌ యూనియన్‌ ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఇప్పటికే ఆ యూనియన్‌ నేత బాబర్‌ సలీం పాషా ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతున్నారు. మూడేళ్లుగా చేసిన పనులు, సాధించిన డిమాండ్లు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో శని, ఆదివారాలలో ఐఎన్‌టియుసి జాతీయ ఫెడరేషన్‌ సమావేశాలను రామగుండంలోనే నిర్వహిస్తున్నది. గత ఎన్నికలలో పోటీలో ఉన్న ఎన్టీపీసీ మజ్దూర్‌ సంఘ్‌(బీఎంఎస్‌), ఎన్టీపీసీ డెమోక్రటిక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (హెచ్‌ఎంఎస్‌), యునైటెడ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ)ఈసారి గుర్తింపు ఎన్నికలలో గెలవాలనే తలంపుతో పావులు కదుపుతున్నాయి. ఐఎన్‌టియుసియేతర సంఘాలు ఫ్రంటుగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలవాలని ఆయా సంఘాలకు చెందిన కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒంటరిగా పోటీ చేస్తే బలమైన ఐఎన్‌టియుసికి మేలు జరిగే అవకాశముందని, ఈ సారి అలాంటి పొరపాటు చేయవద్దనే అభిప్రాయంతో కొందరు నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. బీఎంఎస్‌ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్‌ సంఘ్‌ ఒంటరిగానే పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వివిధ సంఘాలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

నినాదంగా వేతన సవరణ అంశం..

ఎన్టీపీసీ గుర్తింపు ఎన్నికలలో కార్మికుల కొత్త వేతన సవరణ అంశం ఎన్నికల నినాదంగా మారనున్నది. 2017 నుంచి అమలులోకి వచ్చిన వేతన సవరణ 10 ఏళ్ల కాలపరిమితి 2027తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని యూనియన్లు వేజ్‌ రివిజన్‌ అంశాన్ని తెరమీదికి తెచ్చి ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తాము గెలిస్తే మెరుగైన వేతన సవరణ ఒప్పందం చేయిస్తామంటూ అన్ని సంఘాలు కార్మికుల వద్దకు వెళ్లనున్నాయి. కీలకమైన వేతన సవరణ ఒప్పందం గెలుపు, ఓటములను ప్రభావం చేసే అవకాశముంది.

షెడ్యూల్‌ ఇదీ

రామగుండం ఎన్టీపీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నగారా మోగింది. సెప్టెంబరు 25న గుర్తింపు యూనియన్‌ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌, ఎన్టీపీసీ దక్షిణ రీజియన్‌ సీజీఎం(హెచ్‌ఆర్‌) సూర్యనారాయణ్‌ పాణిగ్రహి, ఎన్నికల అధికారి, రామగుండం ప్రాజెక్టు ఏజీఎం(హెచ్‌ఆర్‌) విజయ్‌ కుమార్‌ సిక్దర్‌ వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈనెల 30లోగా ఎన్టీపీసీలోని ప్రాతినిధ్య కార్మిక సంఘాలు తమ రిజిస్ర్టేషన్‌ పత్రాలు, వార్షిక నివేదికలను సమర్పించాలని పేర్కొన్నారు. సెప్టెంబరు 25న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం) ద్వారా పోలింగ్‌ నిర్వహించనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుంది. గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాల ఆధారంగా 2 నేషనల్‌ బైపాట్రియేట్‌ కమిటీ(ఎన్‌బిసి) సభ్యులుగా అ వకాశముంటుంది. 60 శాతంకుపైగా ఓట్లు నమోదు చేసి విజయ సాధించిన యూనియన్‌లోని ఇద్దరు సభ్యులకు ఎన్‌బిసిలో ప్రాతినిధ్యం కల్పిస్తారు. 60 శాతం కన్నా తక్కువ ఓట్లతో గెలిచిన సంఘానికి ఒకటి, రెండో స్థానంలో నిలిచిన యూనియన్‌కు మరో ఎన్‌బిసి సభ్యత్వం లభిస్తుంది.

Updated Date - Aug 24 , 2025 | 12:25 AM