సహకార సంఘాల పెంపునకు కసరత్తు
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:41 AM
కొత్త మండలాలు, డీసీసీబీల ప్రకారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్‌వ్యవస్థీకరణకు సర్కారు కసరత్తు చేస్తోంది. జిల్లాలో 12 కొత్త సొసైటీలను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.
జగిత్యాల, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కొత్త మండలాలు, డీసీసీబీల ప్రకారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్‌వ్యవస్థీకరణకు సర్కారు కసరత్తు చేస్తోంది. జిల్లాలో 12 కొత్త సొసైటీలను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పాలక వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీలు, పీఏఎస్‌ఎస్‌లకు అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించేలా సహకార శాఖ ఆదేశాలు ఇచ్చింది. జిల్లాలోని 51 సహకార సంఘాల పాలక మండళ్ల పదవీ కాలం ఫిబ్రవరిలో ముగిసింది. గత పాలకవర్గాలనే పర్సన్ ఇన్‌చార్జీ మేనేజింగ్ కమిటీలుగా ఆరు నెలల పాటు కొనసాగిస్తూ ఫిబ్రవరి 14వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యేడాది ఆగస్టులో గడువు ముగియడంతో డీసీసీబీ చైర్మన్ల విజ్ఞప్తి మేరకు పదవీకాలం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. వచ్చే యేడాది ఫిబ్రవరి వరకు పాలక వర్గాల గడువు పొడిగించారు. అయితే సంబంధిత జీవోను రద్దు చేస్తూ పీఏసీఎస్‌లకు అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది.
జిల్లాలో 51 సహకార సంఘాలు..
జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వీటిలో సుమారు 1.50 లక్షల మంది సభ్యులు ఉన్నారు. కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ జగిత్యాల జిల్లా పరిధిలో 17 బ్రాంచీలు ఉన్నాయి. 2019 సంవత్సరం ఫిబ్రవరిలో సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికైన పాలక వర్గాల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 14తో ముగిసింది. మొదటిసారి ఎలాంటి నిబంధనలు లేకుండా పదవీ కాలం పొడిగించిన ప్రభుత్వం ఆగస్టులో మాత్రం నిబంధనల ప్రకారం ఉన్న వాటికి మాత్రమే వర్తింపజేయాలనే షరతు విధించింది. ఆగస్టు మాసంలో జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ తాజాగా ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది.
ఫ 23 సొసైటీల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలు
జిల్లాలోని 23 సొసైటీల్లో నిధుల దుర్వినియోగం, అవకతవకలు, అక్రమాలు, నిబంధనలు పట్టించుకోకపోవడం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 సొసైటీల పాలకమండళ్ల గడువు పొడిగింపును ప్రభుత్వం పక్కన బెట్టింది. సంబంధిత సొసైటీల పరిధిలో కొన్నేళ్లుగా నిధుల దుర్వినియోగం, పంట రుణాల జారీలో అక్రమాలు, సొసైటీ స్థలాల ఆక్రమణ, ఐకేపీ సెంటర్ల నుంచి వచ్చే కమీషన్ డబ్బులను ఇతర వాటికి వినియోగించడం తదితర ఆరోపణలతో సంబంధిత సొసైటీ చైర్మన్లను తప్పించి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ఇన్‌చార్జీ బాధ్యతలను అప్పగించారు.
నూతన సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు..
ఇటీవల ప్రభుత్వం కొత్త సంఘాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు స్వీకరించింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంఘాలు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయాల్సిన సొసైటీలను అధికారులు ప్రతిపాదించారు. జిల్లాలో 12 కొత్త సొసైటీలను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఇందులో జిల్లాలోని మోరపల్లి, పోరండ్ల, లక్ష్మీపూర్, మద్దులపల్లి, రాపల్లి, వర్షకొండ, జగ్గసాగర్, కొత్త దాంరాజ్‌పల్లి, బుగ్గారం, మన్నెగూడెం, అంబారిపేట గ్రామాల్లో కొత్తగా సొసైటీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. దీంతో పాటు రాయికల్ మండలం కట్కాపూర్‌లో ట్రైబల్ సొసైటీని ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదించారు. అయితే ఆరు కొత్త సొసైటీల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి.
డీసీసీబీ విస్తరణ జరిగేనా?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగంగా జగిత్యాల జిల్లా ఉంది. రైతులకు సహకార సంఘాల సేవలు మరింత చేరువగా తీసుకొని రావాలని గతంలో కేంద్ర ప్రభుత్వం విస్తరణకు నిర్ణయించింది. నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లాల వారీగా శాఖల విభజన పూర్తయి ప్రాంతీయ కార్యాలయాలు, జిల్లా పరిషత్తులు ఏర్పడ్డాయి. కానీ డీసీసీబీల విస్తరణ మాత్రం జరగలేదు. ఈ అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యపడలేదు. దీంతో డీసీసీబీ సేవలు కరీంనగర్ నుంచే కొనసాగుతున్నాయి. సహకార బ్యాంకు శాఖలు మినహా కొత్త జిల్లాల్లో మిగితా సేవలు అందుబాటులో లేవు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో సైతం డీసీసీబీ ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు చేయాలని 2024 సంవత్సరంలో నిర్ణయించినా అమలుకు నోచుకోలేదు.
సొసైటీలకు త్వరలో ఎన్నికలు?
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలక వర్గాలకు త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. దీనికోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం పాలక వర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సొసైటీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో సహకార సంఘాలు పనిచేయనున్నాయి. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే క్రమంలో ఇటీవల పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు గాని, మున్సిపల్ ఎన్నికల తర్వాత గాని సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లేదంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించిన తర్వాతే పరిషత్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని మరికొందరు భావిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు
-మనోజ్ కుమార్, జిల్లా సహకార శాఖ అధికారి
సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ రేసింది. ఆయా సహకార సంఘాలకు అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించాలని ఆదేశాలు వచ్చాయి. ఈమేరకు జిల్లాలోని సొసైటీలన్నింటికీ అధికారులను పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమించాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటున్నాం.