Share News

మాస్టర్‌ ప్లాన్‌తో ఆలయ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:43 AM

మాస్టర్‌ ప్లాన్‌ తో ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభను నిర్వహించారు. మంత్రి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌ రావు, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మాస్టర్‌ ప్లాన్‌తో ఆలయ అభివృద్ధికి కృషి

ఓదెల, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి) : మాస్టర్‌ ప్లాన్‌ తో ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభను నిర్వహించారు. మంత్రి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌ రావు, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ 20 నెలల్లోనే ఓదెల మండలంలో ఎమ్మెల్యే విజయ రమణారావు శక్తివంచన మేరకు రూ.200 కోట్ల నిధులు ఖర్చు చేశారని, రాబోయే రోజుల్లో ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో టెంపుల్‌ సిటీ ఆర్కిటిక్‌ సిద్ధం చేసేందుకు ప్రణాళికతో సీఎంను సంప్రదిస్తామన్నారు. ఆలయంలో గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి మంత్రి శ్రీధర్‌బాబును కోరుతామని తెలిపారు. గత ప్రభుత్వంలో కేసీఆర్‌ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించినప్పటికీ రాష్ట్రంలో రైతులందరికీ రైతు భరోసా కింద కోట్లాది రూపాయలు చెల్లించిన ఘనత సీఎం రేవంత్‌ రెడ్డికి దక్కిందన్నారు. అనంతరం ఒగ్గు పూజారులకు ఎమ్మెల్యే తో కలిసి టికెట్‌ మీద రూ. 35 పెంచుతూ జారీ చేసిన జీవో కాపీలను పూజారులకు అందజేశారు. ఆలయ అభివృద్ధిలో పాలకవర్గం అతి కీలకమని, మల్లికార్జున స్వామి దయతో విజయరమణారావును మంత్రిగా చూడాలని ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలనేది నా కోరిక అని ఎమ్మెల్యే విజయరామణరావు అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.25లక్షలతో విద్యుత్‌ సౌకర్యాలను కల్పించానని తెలిపారు. ఓదెల కోర్టుకు సొంతభూమిని కేటాయించి భవనాన్ని నిర్మిస్తామన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ చైర్మన్‌ చీకట్ల మొండయ్యతోపాటు ధర్మకర్తలను, అలాగే అతిధులను సన్మానించారు. గ్రంథాలయ చైర్మన్‌ అంతటి అన్నయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఈర్ల స్వరూప, చైర్మన్‌లు ప్రకాష్‌ రావు, తిరుపతిరెడ్డి, ఆళ్ల సుమన్‌ రెడ్డి, నరసింహారెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి, గోపగోని సారయ్య గౌడ్‌, మాజీ జెడ్పిటిసి సభ్యుడు బొద్దుల లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం

భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారాన్ని దేవాదాయ, ధర్మదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నాయిని సుప్రియ సమక్షంలో నిర్వహించారు. మొత్తం 12 మంది సభ్యులు కాగా అనివార్య కారణాల వల్ల ధర్మకర్త నాగపురి రవి, తాళ్లపల్లి శ్రీనివాస్‌ ప్రమాణ స్వీకారం చేయలేదు. అసిస్టెంట్‌ కమిషనర్‌ సుప్రియ చైర్మన్‌ చీకట్ల మొండయ్యతో పాటు ధర్మకర్తలు సమ్మిరెడ్డి, ఉప్పుల శ్రీనివాస్‌, కొండ శ్రీనివాస్‌, జీలుక రవి,కోదాటి మనోహర్‌ రావు, గంట రమేష్‌, తీర్థాల రాజారాం, జంగం కొమరయ్య, సామల జమున ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈఓ సదయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:43 AM