పల్లె ఓటర్ జాబితాకు కసరత్తు
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:05 AM
పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పల్లెల్లో హడావుడి మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడికి మరోవైపు అధికార యంత్రాంగం ఏర్పాట్ల వైపు దృష్టి పెట్టింది. డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేపట్టి అదే ఊపులో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఫొటో
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పల్లెల్లో హడావుడి మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడికి మరోవైపు అధికార యంత్రాంగం ఏర్పాట్ల వైపు దృష్టి పెట్టింది. డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేపట్టి అదే ఊపులో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించి అదే క్రమంలో పరిషత్, బల్దియా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాను సవరించే పనిలో పడింది. గురువారం జిల్లాలో పంచాయతీరాజ్ సిబ్బంది జాబితా సవరణ కసరత్తు మొదలుపెట్టింది. 21న దరఖాస్తులు, అభ్యంతరాలు పరిష్కరించి 23వ తేదీన తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాలను గ్రామపంచాయతీల వారిగా ప్రదర్శించనున్నారు. జిల్లాలో ఇప్పటికే అధికార యంత్రాంగం స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేయడమే కాకుండా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేసినది తెలిసిందే. ఈసారి పాత రిజర్వేషన్ల ప్రకారమే ముందుగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహణకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్సులు, నోడల్ అధికారుల నియామకం, ఆర్వోలు, పివోలు, ఏపీవోలకు రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. సర్పంచ్‌లకు గులాబీ రంగు, వార్డు మెంబర్లకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు ముద్రించడానికి సిద్ధం చేశారు. నోటిఫికేషన్ రావడమే తరువాయి జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంది.
జిల్లాలో 3.53 లక్షల మంది ఓటర్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, 2268 వార్టులు ఉన్నాయి. ఇప్పటికే ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో పంచాయతీలో 3.53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 170772 మంది, మహిళలు 182559 మంది ఉన్నారు. ఇందులో పురుషుల కంటే మహిళా ఓటర్లు 11787 మంది అధికంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓట్లే కీలకం కానున్నాయి. పురుషుల కంటే మహిళా ఓటర్లు 11787 మంది అధికంగా ఉన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో మహిళలు ఓట్లు అధికంగా ఉండడంతో స్థానిక ఎన్నికల్లో గెలుపు, ఓటములపై మహిళా ఓటింగ్ ప్రభావం చూపనున్నట్లు భావిస్తున్నారు. జిల్లా యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు, అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచారు. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, 2268 వార్డు సభ్యులు ఉండగా 1734 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబందించి 200 మంది ఓటర్లు ఉన్నవరకు 1734 పోలింగ్ కేంద్రాలు, 400 ఓటర్ల వరకు 468 పోలింగ్ కేంద్రాలు, 650 ఓటర్ల వరకు ఉన్న పంచాయతీల్లో 76 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. అంతకుమించి ఓటర్లు ఉంటే రెండో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. 200 మంది ఓటర్లు ఉన్న చోట ఒక ప్రిసైడింగ్ అధికారి ఒక పోలింగ్ అధికారి ఉంటారు. 201 నుంచి 400 వరకు ఒక ప్రిసైడింగ్ అధికారి ఇద్దరు పోలింగ్ అధికారులు, 401నుంచి 650 వరకు ఉంటే ప్రిసైడింగ్ అధికారితో పాటు ముగ్గురు పోలింగ్ అధికారులను నియమిస్తారు.