ఘనంగా దసరా వేడుకలు
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:18 PM
జిల్లా వ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్నంటాయి... గురువారం ఉదయం నూతన దుస్తులు ధరించి ఆలయాలను సందర్శించారు... ఆలయల్లో వాహన పూజలు నిర్వహించారు... సాయంత్రం జమ్మి చెట్టు వద్దకు దేవుడి విగ్రహాలతో ఊరేగింపుగా వెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దపల్లి కల్చరల్, అక్టోబరు3(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శమీ పూజలో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రావణ దహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని విజయదశమి సంప్రదాయాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని, పెద్దపల్లి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, ఏసీపీ కృష్ణ, పోలీసులు, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఐటీఐ మైదానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శమీ పూజలు చేశారు. దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలయ్ బలయ్ తీసుకున్నారు. నాయకులతోపాటు వాకర్స్ వెంకట్ రెడ్డి, డాక్టర్ రాజమల్లు, కొమ్ము సుధాకర్, అతీక్ పాల్గొన్నారు.
కమిషనరేట్‌లో ఆయుధ పూజ
కోల్‌సిటీ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): విజయదశమి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో గురువారం ఆయుధపూజ, వాహన పూజ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో పూజలు నిర్వహించడం ద్వారా ప్రతి ఆయుధానికి శక్తి కలుగుతుందన్నారు. పోలీస్‌శాఖలోప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ ప్రజల మన్ననలు అందుకోవాలన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ స్థాయి మరింత పెరిగేలా పని చేయాలన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటామన్నారు. సమాజంలోని చెడును పారదోలేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తోందన్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్‌రావు, ఎస్‌బీఐ భీమేష్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.