రామగుండానికి డబుల్ బొనాంజా
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:33 PM
రామగుండానికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బోనంజా ప్రకటించింది. మంగళవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో రూ.17వేల కోట్ల పెట్టుబడులతో రెండు విద్యుత్ కేంద్రాల స్థాపనకు ఆమోద ముద్ర వేసింది. జీవిత కాలం ముగియడంతో మూతబడిన బీ థర్మల్ స్థానంలో ఎన్‌టీపీసీ సహకారంతో 800మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
గోదావరిఖని, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రామగుండానికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బోనంజా ప్రకటించింది. మంగళవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో రూ.17వేల కోట్ల పెట్టుబడులతో రెండు విద్యుత్ కేంద్రాల స్థాపనకు ఆమోద ముద్ర వేసింది. జీవిత కాలం ముగియడంతో మూతబడిన బీ థర్మల్ స్థానంలో ఎన్‌టీపీసీ సహకారంతో 800మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.13వేల కోట్ల పెట్టుబడితో ఈ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నారు. జెన్‌కో దగ్గర వనరులు అందుబాటులో లేకపోవడంతో ఎన్‌టీపీసీ సహకారంతో విద్యుత్ కేంద్రం నిర్మించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎన్‌టీపీసీ యాజమాన్యం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలో జాయింట్ వెంచర్‌లో కానీ, స్వతహాగా కానీ విద్యుత్ కేంద్రాల స్థాపనకు ఆసక్తి కనబరిచింది. ఈ పరిస్థితుల్లో రామగుండం బీ థర్మల్ స్థానంలో ఏర్పాటు చేయనున్న కొత్త విద్యుత్ కేం ద్రాన్ని ఎన్‌టీపీసీ సహకారంతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. గతంలో సింగరేణితో జాయింట్ వెంచర్ చేయాలని భావించినా ఇప్పుడు ఎన్‌టీపీసీ ముందుకు రావడంతో ఎన్‌టీపీసీని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. తద్వారా స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కలు గనున్నది. రామగుండం పట్టణానికి పునర్ వైభవం లభించనున్నది. అలాగే రామగుండం పట్టణం పక్కనే ఉన్న మేడిపల్లి ఓసీపీలో సుమారు రూ.4వేల కోట్ల సింగరేణిలోనే మొదటిసారిగా పంప్‌డ్ స్టోరేజీ పవర్‌ప్లాంట్ నిర్మాణానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పవర్‌ప్లాంట్ నిర్మాణం జరిగితే సింగరేణి సంస్థ భవిష్యత్‌లో మరిన్ని పంప్‌డ్ స్టోరేజీ పవర్‌ప్లాంట్లు నిర్మించేందుకు మార్గం ఏర్పడుతుంది. ఈ రెండు భారీ ప్రాజెక్టులు రామగుండానికి రావడంతో స్థానికంగా హర్షం వ్యక్తం అవుతుంది. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ రామగుండం పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుకునేందుకు ముఖ్యమంత్రి, మంత్రులపై ఒత్తిడి చేస్తూ వచ్చారు. మంత్రి శ్రీధర్‌బాబు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండడంతోపాటు ప్రభుత్వంలో కీలకం కావడంతో ఈ ప్లాంట్ ప్రకటనకు పూర్తిగా సహకరించారు.
ఎన్‌టీపీసీ భాగస్వామ్యంతో భూ సేకరణ అవసరం ఉండదు...
రామగుండంలో విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఎన్‌టీపీసీ భాగస్వామ్యం అయితే భూ సేకరణ అవసరాలు కూడా ఉండదు. పక్కనే ఉన్న కుందన పల్లి యాష్ పాండ్‌ను కానీ, రాజాపూర్‌లో నిర్మించనున్న యాష్ పాండ్‌ను కానీ వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
రామగుండానికి సీఎం ప్రాణం పోశారు...
ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
రామగుండంలో నిజాం హయాంలో విద్యుత్ కేంద్రాల స్థాపన జరిగింది. అవి జీవితకాలం ముగియడంతో మూతబడ్డాయి. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి రామగుండానికి విద్యుత్ కేంద్రాలు మంజూరు చేసి ప్రాణం పోశారు. ప్రజల మనోభావాలు, సెంటిమెంట్లు, ఉపాధిని పరిగణలోకి తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకరించారు. జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు రుణం తీర్చుకోలేనిది.