వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలి
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:18 AM
వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. బుధవారం ఉదయం కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్‌లను కలెక్టర్ పరిశీలించారు.
పెద్దపల్లిటౌన్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. బుధవారం ఉదయం కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్‌లను కలెక్టర్ పరిశీలించారు. ఔట్ పేషెంట్ విభాగంలో ఉదయం తొమ్మిదన్నరకు తర్వాత ఆరుగురు వైద్యులు ఆలస్యంగా రావడం గమనించి ఇలాంటివి పునారవృతం కాకుండా ఉండాలని, అవసరం అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలను కలెక్టర్ ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ, ఔట్ పేషెంట్ సేవలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాలని, వైద్యుల హాజరు పై సరైన పర్యవేక్షణ ఉండాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలులోకి తీసుకొని రావాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత పెంచుకోవాలని, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రీమియం రేంజ్ లో సేవలు, పారిశుధ్య సేవలు ఉండాలని, దీనికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తామన్నారు. ప్రభుత్వ వైద్యులు డ్యూటీ సమయంలో పైవ్రేట్ ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది పేషెంట్లతో మర్యాద పూర్వకంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆయూష్ ఆసుపత్రి విభాగం పరిశీలించిన కలెక్టర్ అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. ఆయూష్ ఆసుపత్రిలో నెల రోజులకు అవసరమైన మందులు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు.